poulomi avante poulomi avante

ట్రిపుల్ ఆర్ వ‌స్తే ఏమ‌వుతుంది?

రీజిన‌ల్ రింగ్ రోడ్డు చేరువ‌లో ప్లాటు కొన‌క‌పోతే వ‌చ్చే న‌ష్ట‌మేం లేదు. ట్రిపుల్ ఆర్ వ‌ల్ల ఏదో అద్భుతం జ‌రుగుతుంద‌ని.. స్థ‌లం కొన‌డానికిదే స‌రైన స‌మ‌య‌మ‌ని అని ఎవ‌రైనా ఊద‌ర‌గొడితే అస్స‌లు నమ్మొద్దు. 15 ఏళ్ల క్రితం ఆరంభమైన ఔట‌ర్ రింగ్ రోడ్డే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంద‌లేదు. ప‌శ్చిమం త‌ప్ప మిగ‌తా ప్రాంతాల‌న్నీ వెల‌వెల‌బోతున్నాయి. ఓఆర్ఆర్‌కి ఇరువైపులా 316 కిలోమీట‌ర్ల మేర‌కు కేటాయించిన గ్రోత్ కారిడార్‌.. 20 ఇంట‌ర్ చేంజ్ జంక్ష‌న్లు వంటివి వృద్ధిప‌థంలోకి రావ‌డానికి ప‌ది, ప‌దిహేనేళ్ల‌యినా ప‌డుతుంది. కాబ‌ట్టి, కొంద‌రు ఏజెంట్ల మాయ‌మాట‌ల్ని న‌మ్మి.. ప్లాటు కొనేసి.. దాన్ని నిర‌ర్థ‌క ఆస్తిగా మార్చుకోకండి.

Telangana Regional Ring Road
Telangana Regional Ring Road

ఒక్కసారి ఔట‌ర్ రింగ్ రోడ్డును క్షుణ్నంగా ప‌రిశీలిస్తే.. గ‌చ్చిబౌలి నుంచి నార్సింగి దాకా స‌ర్వీసు రోడ్డుకి అటుఇటుగా కొన్ని హైరైజ్ గేటెడ్ క‌మ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు ఆరంభ‌మ‌య్యాయి. మ‌రోవైపు కొల్లూరు దాకా కొత్త క‌ట్ట‌డాలు ఏర్ప‌డ్డాయి. ఇక కొల్లూరులో స‌ర్వీస్ రోడ్డు లేనే లేదు. అక్క‌డ ఓఆర్ఆర్ నుంచి స‌ర్వీస్ రోడ్డుకు వెళ్లాలంటే, మ‌ట్టి రోడ్డు మీద ప్ర‌యాణించాల్సిన దుస్థితి. అయితే, మొత్తం 158 కిలోమీట‌ర్ల ఓఆర్ఆర్‌కి అటుఇటుగా కిలోమీట‌ర్ చొప్పున గ్రోత్ కారిడార్ అని ప్ర‌భుత్వం ఆనాడే ప్ర‌క‌టించింది. అంటే, ఈ 316 కిలోమీట‌ర్ల‌లో ప్రాజెక్టులు రావాలంటే ఎంత‌లేద‌న్నా మ‌రో ప‌ది, ప‌దిహేనేళ్ల‌యినా ప‌డుతుంది.

ఒక్క ప‌శ్చిమ హైద‌రాబాద్ త‌ప్ప మిగ‌తా ప్రాంతాలూ అంత ఆశాజ‌నంగా క‌నిపించ‌డం లేదు. ఆదిభ‌ట్ల వ‌ద్ద టీసీఎస్‌, కాగ్నిజెంట్ వ‌ల్ల కొంత క‌ద‌లిక‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. అక్క‌డ రియ‌ల్ కంపెనీలు గ‌జం ధ‌ర అభివృద్ధి చెందిన ప్రాంతంతో స‌మానంగా చెబుతున్నారు. ఇక‌, పోచారం వ‌ద్ద ఇన్ఫోసిస్ వంటి సంస్థ‌లు ఏర్ప‌డటంతో అక్క‌డ రియ‌ల్ట‌ర్లు, మ‌ధ్య‌వ‌ర్తులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు చెల‌రేగిపోవ‌డంతో.. ప్లాట్లు, ఫ్లాట్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి.

ఈమ‌ధ్య కాలంలో ప‌టాన్ చెరు వ‌ద్ద సుల్తాన్ పూర్‌లో మంత్రి కేటీఆర్ ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో.. అక్కడ స్థ‌లాల రేట్లు రాకెట్ స్పీడును అందుకున్నాయి. తీరా చూస్తే, అక్క‌డ ఆశించినంత అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. బాటాసింగారం వ‌ద్ద లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల అక్క‌డా అదే ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఇదంతా చూస్తుంటే, రియ‌ల్ సంస్థ‌ల‌ను బ‌తికించ‌డానికే ప్ర‌భుత్వం ఆయా ప్ర‌క‌ట‌న‌లు చేసిందా అనే సందేహం సామాన్యుల‌కు క‌లుగుతోంది.

ఇక‌, బుద్వేల్ ఐటీ పార్కు క‌థ అయితే మ‌రీ ఘోరం. అప్ప‌టివ‌ర‌కూ అక్క‌డి డెవ‌ల‌ప‌ర్లు చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.3000 అటుఇటుగా ఫ్లాట్ల‌ను అమ్ముకునేవారు. అలాంటిది కేటీఆర్ ఐటీ పార్కును ఆరంభించగానే ఒక్క‌సారిగా చ‌ద‌ర‌పు అడుక్కీ గ‌రిష్ఠంగా ప‌దిహేను వంద‌ల దాకా పెంచేశారు. అంటే, అప్ప‌టివ‌ర‌కూ రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ కేవ‌లం న‌ల‌భై ల‌క్ష‌ల‌కే ల‌భించేది. అలాంటిది, ప్ర‌స్తుతం డెబ్బ‌య్ ల‌క్ష‌లు పెట్ట‌నిదే దొర‌క‌ని దుస్థితి నెల‌కొంది.

శివారు ప్రాంతాల‌న్నీ పెంచేశారు

నిన్న‌టివ‌ర‌కూ శివారు ప్రాంతాల్లో ప్లాటో, ఫ్లాటో కొనుక్కునే ప‌రిస్థితి ఉండేది. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల వ‌ల్ల వీరిలో ఆశ పెరిగి.. ఒక్క‌సారిగా రేట్ల‌ను పెంచేశారు. పోనీ, కొనుగోలుదారుల జీతాలు అంతంత పెరిగాయా? అంటే అదీ లేదు. ఆయా ప్రాంతాలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందాయా? అంటే అదీ లేదు. మ‌రెందుకు.. ఇంత‌లా రేట్లు పెరుగుతున్నాయా? అంటే జ‌వాబు లేనే లేదు. తోటోడు తొడ కోసుకున్నాడంటే మ‌నోళ్లు మెడ కోసుకునే ర‌కాలు క‌దా.. అందుకే, ఇష్టం వ‌చ్చిన‌ట్లు రేట్లు పెంచేశారు. ఇప్పుడేమో వాటిని అమ్ముకోలేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. మొద‌టి విడ‌త‌లో ఫ్లాట్ల‌న్నీ ఊహించిన దానికంటే త‌క్కువ స‌మ‌యంలో అమ్మేశారు. కాక‌పోతే, ఆ త‌ర్వాతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే, ఈమ‌ధ్య అధిక శాతం కంపెనీలు ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డానికి రాయితీల్ని ప్ర‌క‌టిస్తున్నాయి.

హైద‌రాబాద్ నుంచి స‌దాశివ‌పేట్ దాదాపు 75 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం వెళ్లేసి అధిక శాతం మంది రియ‌ల్ట‌ర్లు వెంచ‌ర్లు వేస్తున్నారు. అక్క‌డేదో అద్భుతం జ‌రుగుతుంద‌న్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నారు. అక్క‌డ గ‌జానికి రూ.5000 కి అటుఇటుగా చెబుతున్నారు. ఇప్పుడు అక్క‌డ కొన‌క‌పోతే ఏదో ఘోర‌మైన న‌ష్టం జ‌రిగిపోతుంద‌నే రీతిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఇక్క‌డ మీరంతా గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. అంతంత దూరం వెళ్లి ప్లాట్లు కొనుగోలు చేసినా మీరు వెళ్లి అక్క‌డ ఉండ‌లేరు. పోని, ఆ ప్రాంతంలో నేడు కొంటే, రెండు నుంచి మూడేళ్ల‌లో రేటు పెరుగుతుందా? అదీ లేదు. కాబ‌ట్టి, రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ల మోస‌పూరిత మాట‌ల‌కు ప‌డిపోయి.. అంతంత దూరం వెళ్లేసి మీ సొమ్మును వారి చేతిలో పోయ‌కండి. మీ క‌ష్టార్జితాన్ని బూడిదలో పోసిన ప‌న్నీరు చేసుకోకండి.

ఒక‌వేళ‌, మీ వ‌ద్ద ఇప్ప‌టికే ఇబ్బ‌డిముబ్బ‌డిగా డ‌బ్బులుండీ, ఒక రాయి వేద్దామ‌ని.. ఒక‌ట్రెండు ప్లాట్లు కొనుగోలు చేయాల‌నుకుంటే చేయండి. కాక‌పోతే, పెట్టుబ‌డి కోణంలో మాత్రం ఆలోచించి అక్క‌డ ఏమాత్రం ప్లాటు కొన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే, 2008లో మ‌హేశ్వ‌రం వంటి ప్రాంతంలో గ‌జం ధ‌ర రూ.10 వేల వ‌ర‌కూ వెళ్లింది. అలాంటి, మ‌ళ్లీ ప‌దేళ్ల దాకా అటువైపు ఎవ‌రూ క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. మ‌ధ్య‌లో గ‌జం నాలుగైదు వేల‌కు అమ్ముదామంటే కొనే నాధుడే లేడు. ఆత‌ర్వాత తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత గ‌త మూడేళ్ల నుంచి మ‌ళ్లీ క‌ద‌లిక‌లు ఆరంభ‌మ‌య్యాయి. శంషాబాద్ విమానాశ్ర‌యానికి కూత‌వేటు దూరంలో ఉన్న మ‌న్‌సాన్‌ప‌ల్లిలో ఇలాంటి ప‌రిస్థితి ఉంటే, స‌దాశివ‌పేట్‌లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఒక‌సారి ఆలోచించి తుది నిర్ణ‌యం తీసుకోండి. ఆర్ ఆర్ ఆర్ వ‌ల్ల ఇప్పుడిప్పుడే ఒన‌గూడే ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌నే విష‌యాన్ని గుర్తించాకే పెట్టుబ‌డి విష‌యం ఓ నిర్ణ‌యానికి రండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles