భాగ్యనగరంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యానికి తెలంగాణ రెరా అథారిటీ అనుమతినిచ్చింది. ఎస్ఏఎస్ క్రౌన్ అని నామకరణం చేసిన ఈ జి+57 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని సాస్ (ఎస్ఏఎస్) సంస్థ కోకాపేట్‌లోనిర్మిస్తోంది. సుమారు 4.2 ఎకరాల్లో.. నిర్మించే ఈ ప్రాజెక్టులో ఐదు టవర్లను డిజైన్ చేశారు. ఇందులో వచ్చవేన్నీ నాలుగు అంతస్తుల ఫ్లాట్లే కావడం గమనార్హం. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికొస్తే.. మూడంటే మూడే సైజులున్నాయి. ఒకటి 6565 చదరపు అడుగులు, మరోటి 6999 చ.అ., ఇంకోటి 8811 చదరపు అడుగుల్లో కడుతున్నారు. డ్యూప్లే ఫ్లాట్లను పదిహేడు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. కాకపోతే, వీటి సంఖ్య తక్కువున్నాయి. కాకపోతే, ఈ ఎక్స్‌క్లూజివ్ ఫ్లాట్లకే ఎక్కడ్లేని డిమాండ్ ఉంది. ఇందులో ప్రత్యేకంగా పూల్‌ని డిజైన్ చేశారు. ఈ ఫ్లాట్లో నివసించేవారు.. అలా ఆకాశాన్ని చూస్తూ జలకాటలు ఆడొచ్చు. మొదటి మూడు టవర్లలో 8811 చదరపు అడుగుల ఫ్లాట్లను మాత్రమే డిజైన్ చేశారు. నాలుగో టవర్‌లో 6565, ఐదో టవర్‌లో 6999 చదరపు అడుగుల్లో కడుతున్నారు. ధర విషయానికి వస్తే.. మొదటి రకానికి రూ.6.57 కోట్లు, రెండు రకం రూ.7 కోట్లు, 8811 చ.అ.ఫ్లాటుకు రూ.8.81 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. డ్యూప్లే ఫ్లాటు కావాలంటే రెండింతలు పెట్టాల్సిందే.
స్కైలాంజ్.. బిజినెస్ లాంజ్..
ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో క్లబ్ హౌజును 69 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. ఇందులో నివసించేవారు తివాచీరపర్చిన పచ్చదనంలో ఏర్పాటు చేసిన మల్టీ ఫంక్షన్ హాళ్లో కలుసుకోవచ్చు. స్కై లాంజీలు ఉండనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఫ్యామిలీ గ్యాథరింగ్ పెవిలియన్లకు పెద్దపీట వేశారు. ప్రైవేటు పార్టీ రూములకు స్థానం కల్పించారు. బిజినెస్ మీటింగుల కోసం ప్రత్యేక లాంజీలతో పాటు ప్రజంటేషన్ రూముల్ని ఏర్పాటు చేశారు. ఎంటర్ టైన్మెంట్ కోసం రీడింగ్ లాంజ్, లైవ్ ప్రదర్శనకు ప్రత్యేక లాంజ్, కిడ్స్ క్యాంపింగ్ లాన్, యాంపీథియేటర్ వంటివాటికి పెద్దపీట వేశారు. ఇలా మొత్తం లైఫ్ స్టయిల్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా సుమారు లక్ష చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. 2027లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని సంస్థ చెబుతోంది.