గోద్రేజ్ సంస్థ తెలంగాణలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఖమ్మం జిల్లాలో స్థానిక వాతావరణానికి అనువైన విత్తన రకాలను అభివృద్ధి చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ నే ఏర్పాటు చేయనుంది. అలాగే 5 లక్షల మొక్కలను పెంచే సామర్థ్యంతో ఓ నర్సరీని ఏర్పాటు చేస్తుంది. తద్వారా దాదాపు 50వేల మంది రైతులకు మద్దతుగా నిలవడంతోపాటు దాదాపు 2వేల మందికి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోద్రేజ్ గ్రూప్ కు రాష్ట్రం నిలయంగా మారుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బలమైన, విశ్వసనీయమైన భాగస్వామిగా గోద్రేజ్ ముందుకు వచ్చిందన్నారు. అనేక రంగాల్లో లోతైన అనుబంధాన్ని పెంపొందించుకుంటున్నట్టు చెప్పారు. ఆయిల్ పామ్ కాకుండా గోద్రేజ్ డైరీ, ఫార్మా, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, ఫర్నిచర్; రియల్ ఎస్టేట్, రిటైల్, పౌల్ట్రీ, పశుగ్రాసం, ఆక్వా కల్చర్ లో పెట్టుబడులు పెట్టే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.