తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీ కఠినంగా వ్యవహరిస్తుండటంతో బిల్డర్లు, రియల్టర్ల వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. టీఎస్ రెరా పలు సంస్థలపై జరిమానా విధించడం.. ఆయా వివరాల్ని పత్రికాముఖంగా ప్రచురించడంతో.. ఆయా కంపెనీల ప్రతిష్ఠ ఒక్కసారిగా మార్కెట్లో దెబ్బతిన్నది. ఇంతకాలం సంపాదించిన పేరు మొత్తం పాడైంది. ఇలాంటి ఇబ్బందులు వద్దనుకుంటున్న డెవలపర్లు క్రమక్రమంగా రెరా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం మొదలైంది. తమ బృందాలకు చెప్పి రెరా అథారిటీకి ఇవ్వాల్సిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు అందజేయాలని పలువురు డెవలర్లు ఇప్పటికే చెప్పారని సమాచారం. ఎందుకంటే, ఎప్పుడు రెరా అధికారులు తమ మీద పడతారేమోననే భయంతో బిల్డర్ల వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని సమాచారం. ఈ క్రమంలో అనేక మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. ఏదీఏమైనా, టీఎస్ రెరా ఛైర్మన్ రాకతో.. బిల్డర్లలో మార్పు రావడం స్వాగతించాల్సిన విషయం.
ప్రీలాంచులు తగ్గాలంతే..
టీఎస్ రెరా ఛైర్మన్ వచ్చినప్పటికీ.. కొందరు ప్రమోటర్లు ప్రీలాంచ్ కార్యకలాపాల్ని మాత్రం వదలట్లేదు. కొత్త సంస్థల్ని ఆరంభించి ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు భువనతేజ అనే సంస్థ కొవిడ్ సమయంలో ప్రీలాంచ్ వ్యాపారాన్ని నిర్వహించి దాదాపు రూ.400 నుంచి రూ.500 కోట్లను వసూలు చేసింది. ఆతర్వాత చేతులెత్తేసింది. అయితే, భువనతేజ పేరు మీద కాకుండా ప్రణవి ఇన్‌ఫ్రాటెక్ అనే సంస్థ పేరిట చేస్తున్నాడని తెలిసింది. మరి, పేరు మార్చి ప్రీలాంచ్ దందాను నిర్వహిస్తున్న ఇలాంటి సంస్థల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత తెలంగాణ రెరా అథారిటీపై ఉంది.