జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 31 శాతం వృద్ధి
హైదరాబాద్ లో 16 శాతం పెరిగిన లీజింగ్
కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి
దేశంలో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ బాగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 17.3 మిలియన్ చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 13.2 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. ఈ ఏడాది 31 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం లీజింగ్ లో బెంగళూరు, హైదరాబాద్ లోనే సగం మేర లీజింగ్ నమోదైందని కొలియర్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. హైదరాబాద్ లో గతేడాది ఇదే త్రైమాసికంలో 2.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్ జరగ్గా.. ఈసారి అది 16 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. బెంగళూరులో 6.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ జరిగింది. ఒక త్రైమాసికం వారీగా అత్యధిక లీజింగ్ ఇదే కావడం గమనార్హం.
గతేడాది ఇదే కాలంలో జరిగిన 3.4 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ తో పోలిస్తే 85 శాతం పెరుగుదల కనిపించింది. పుణెలో లీజింగ్ 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒక మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ నమోదైంది. ముంబైలో 1.7 మిలియన్, చెన్నై మార్కెట్లో 1.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున లీజింగ్ నమోదైంది. ఢిల్లీ మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. కాగా, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో నమోదైన లీజింగ్‌లో 25 శాతం మేర టెక్నాలజీ రంగం నుంచే ఉందని కొలియర్స్ ఇండియా నివేదిక పేర్కొంది. అనంతరం బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేట్ల నుంచి లీజ్ ఒప్పందాలు అధికంగా జరిగాయి. లీజు లావాదేవీల్లో రూ.లక్ష ఎస్‌ఎఫ్‌టీకి మించినవే 65 శాతంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.