తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఆరంభమైంది. ఈ ఎలక్షన్లో ఎలాగైనా గెలుపొందాలని.. భారాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు శక్తియుక్తిల్ని ధారపోస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ఎక్కువ మంది ప్రజలు రాజకీయాల మీదే దృష్టి సారిస్తారు. సుమారు నలభై రోజులకు పైగా ఇదే వాతావరణం రాష్ట్రంలో నెలకొంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్ని రియల్ సంస్థలు విడుదల చేస్తున్న ప్రకటనల్ని చూస్తే నవ్వొస్తుంది. ఉదాహరణకు క్యాండియర్ క్రీసెంట్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనను చూస్తే ఇళ్ల కొనుగోలుదారులకు ఎక్కడ్లేని జోక్‌గా కనిపిస్తుంది.
ప్రైస్ హైక్ అలర్ట్.. కొద్ది రోజులు మాత్రమే..
ఇలా హోమ్ బయ్యర్లకు క్యాండియర్ సంస్థ మెసేజ్‌లను పంపిస్తుంది. దీన్ని చూసి గృహ కొనుగోలుదారులకు నవ్వు ఆగట్లేదు. ఈ సంస్థకు స్థానిక రాజకీయ పరిస్థితులు తెలియదేమోననే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే, క్యాండియర్ అనే సంస్థ బెంగళూరుకు చెందింది. ఈ కంపెనీకి స్థానిక రాజకీయాలకు సంబంధించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే, ప్రైస్ హైక్ అలర్ట్ అంటూ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వాస్తవానికి, ఎన్నికల సీజన్‌లో ఏదైనా ఆఫర్లు ప్రకటించాలి తప్ప.. ధర పెరుగుతున్నదంటూ అధిక శాతం సంస్థలు పెద్దగా ప్రచారాన్ని నిర్వహించవు. కానీ, ఇక్కడ మాత్రం క్యాండియర్ అనే సంస్థ కాస్త భిన్నంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి భారాస, కాంగ్రెస్ వంటి పార్టీలకు ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమని చెప్పొచ్చు.
మధ్యలో బీజేపీ పార్టీ ఉండనే ఉంది. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకత్వం ఢిల్లీ నుంచి విచ్చేసి తెలంగాణలో మకాం వేసి బస్సుయాత్రలు, బహిరంగ సభల్ని నిర్వహిస్తుంటే.. అధిక శాతం ప్రజలు వాటి మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. ధరలు పెరిగే అవకాశముందంటూ క్యాండియర్ సంస్థ ప్రచారం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందంటూ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదీఏమైనా, ఇప్పుడు కొనాలా.. కొన్నాళ్లయ్యాక కొనాలా.. అనే విషయాన్ని అంతిమంగా ఇళ్ల కొనుగోలుదారులే నిర్ణయించుకుంటారనే విషయాన్ని ప్రతిఒక్కరూ నమ్మాల్సిందే.