తొమ్మిది నెలల క్రితం ప్రారంభమైన మహా రెరా కౌన్సెలింగ్ వ్యవస్థకు చక్కని స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ప్రతినెలా దాదాపు 375 మంది ఇళ్ల కొనుగోలుదారులు, డెవలపర్లు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఫ్లాట్ల అప్పగింత జాప్యం తదితన అంశాలపై కొనుగోలుదారులకు ఉన్న సందేహాలు నివృత్తి చేయడంతోపాటు మహా రెరా నిబంధనలు, నిర్దేశిత సమయంలోగా రిపోర్టుల సమర్పణ వంటి విషయాలపై డెవలపర్లకు దీని ద్వారా సమగ్ర అవగాహన కల్పించారు. కౌన్సెలింగ్ కు వస్తున్నవారిలో 70 నుంచి 75 శాతం మంది కొనుగోలుదారులు ఉండగా.. మిగిలినవారు డెవలపర్లు అని మహా రెరా అధికారులు తెలిపారు. చాలామంది కొనుగోలుదారులకు మహా రెరా నిబంధనలు తెలియవని, అలాగే తమ సందేహాలు ఎలా నివృత్తి చేసుకోవాలి? ఫిర్యాదులను ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాల పట్ల కూడా అవగాహన లేదని.. అందువల్లే తాము ఇద్దరు అధికారులతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు వివరించారు.