కోకాపేట్ చేరువలోని నార్సింగిలో టూ బీహెచ్ కే ఫ్లాట్ల ప్రాజెక్టు వస్తోందని సమాచారం. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు పక్కనే ఈ నిర్మాణాన్ని ఆరంభించేందుకు నగరానికి చెందిన నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి, ఇప్పటిదాకా కోకాపేట్, నార్సింగి, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా రెండు పడక గదుల ఫ్లాట్ల ప్రాజెక్టును ఏ సంస్థా ఆరంభించలేదు. వీటికి డిమాండ్ ఉన్నప్పటికీ, వీటిపై ఫోకస్ పెట్టిన సంస్థలు పెద్దగా లేవు. ఎందుకంటే, పెద్ద విస్తీర్ణంలో ఫ్లాట్లను డిజైన్ చేయడంతో పాటు నిర్మాణ పనులూ చేయడం సులువు. అదే 2 బీహెచ్కే ఫ్లాట్లను నిర్మిస్తే ప్రాజెక్టు ప్లానింగ్ కష్టమవుతుందని అధిక శాతం మంది బిల్డర్లు భావిస్తారు. పైగా, ఎక్కువ శాతం మంది కొనుగోలుదారులతో డీల్ చేయడం కష్టమవుతుందని అనుకునేవారు. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పలువురు డెవలపర్లు ప్రణాళికల్ని మార్చుకుంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీము వర్తించేలా ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. దీని వల్ల నగరంలో అధిక శాతం మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కల సాకారం అవుతుంది.