- అనధికారికరంగా ట్రిపుల్ వన్ రద్దు
- విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
- ఓట్ల కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం - 111 జీవోపై పార్టీలన్నీ తమ వైఖరిని తెలపాలి
- నగరవాసులు, పర్యావరణవేత్తల ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది.. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం, రైతులు, ప్రజలతో పాటు సామాజిక కార్యకర్తలు ట్రిపుల్ వన్ జీవోపై ఏయే పార్టీ ఎలా స్పందిస్తునే విషయంలో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అధికారిక బీఆర్ఎస్ పార్టీ ఎలా తయారైందంటే.. వరదలు సంభవించి హైదరాబాద్ కొట్టుకుపోయినా ఫర్వాలేదు.. తమకు మాత్రం ఎన్నికల్లో ఓట్లే కీలకమన్నట్లుగా వ్యవహరిస్తోందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా, అంతర్జాతీయ ఖ్యాతినార్జిస్తోన్న హైదరాబాద్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీ మీదే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ట్రిపుల్ వన్ జీవోను తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. కానీ, ఇంతవరకూ అందుకు సంబంధించిన జీవోను ఎక్కడా విడుదల చేయలేదు. ఈ రద్దుపై వివిధ వర్గాల ప్రజలు, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, పలు రాజకీయ పార్టీలు జంట జలాశయాల్ని కాపాడాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ జీవోను ఎట్టి పరిస్థితిలో రద్దు చేయకూడదని, ఎందుకంటే భవిష్యత్తులో వరదలు సంభవిస్తే హైదరాబాద్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని అంటున్నారు. ఒకవేళ వరదలు పెరిగితే భాగ్యనగరాన్ని రక్షించుకునేందుకు ఈ జంట జలాశయాలు అత్యవసరమని విన్నవిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేతను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను తొలగించి 69 జీవోను ప్రవేశపెట్టామని చెబుతోంది. కాకపోతే, ఈ జీవో అధికారికంగా ఇంకా విడుదల కాలేదు. ఒకవేళ అయినా, ఆ జీవోను ఎవరికి అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే, సాంకేతికంగా చూస్తే 111 జీవో రద్దు కాలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు హై కోర్టుకు విన్నవించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ జీవో అమలుపై నిలినీడలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు.
హైదరాబాద్ భవిష్యత్తు ఏం కావాలి?
111 జీవోను కఠినంగా అమలు చేయాలి. జంట జలాశయాలను రక్షించుకోవడంతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు వీలు అవుతుంది. ఎన్నికల్లో ఈ అంశంపై ప్రతి పార్టీ తమ అభిప్రాయాల్ని తెలియజేయాలి. ఎందుకంటే, దీనిపై హైదరాబాద్ భవిష్యత్తు ఆధారపడుతుంది ప్రముఖ పర్యావరణవేత్త డా. లుబ్నా సర్వత్ అభిప్రాయపడ్డారు.