తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుహ్యమైన రీతిలో అధికారం చేపట్టడంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లలో కాస్త గందరగోళం ఏర్పడుతుంది. వచ్చే ఐదేళ్లపాటు హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలు మరింత పెరుగుతాయని ఆశించిన పెట్టుబడిదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మార్కెట్ రేటు కంటే అధిక ధర పెట్టి కొందరు భూముల్ని కొన్నారు. మరికొందరు ప్లాట్లు తీసుకున్నారు. ఇంకొందరు ప్రీలాంచ్‌లో తక్కువ రేటంటే కొనుగోలు చేశారు. వీరు భావించినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులుండేవి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.
తెలంగాణ ఆవిర్భవించిన తొమ్మిదిన్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రయత్నించింది. ఈ రంగం ఎదుర్కొనే సమస్యల్ని అర్థం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. 2016లో ఏకకాలంలో పదికి పైగా జీవోలను మంజూరు చేశారు. అప్పటివరకూ తెలంగాణ ఉద్యమం కారణంగా డీలాపడ్డ బిల్డర్లలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇక హైదరాబాద్‌లో రియల్ రంగం వెనుతిరిగి చూడలేదు.
బిల్డర్లలో ఆందోళన..
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నగర నిర్మాణ రంగం అంతర్జాతీయ ఖ్యాతినార్జించిందనడంలో సందేహం లేదు. ప్రధానంగా, అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ నగరానికి విచ్చేసిన తర్వాత.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఖ్యాతినార్జించింది. ఆతర్వాత అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భాగ్యనగరంలోకి అడుగుపెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో 2018 నుంచి రియల్ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. క్రమక్రమంగా భూముల ధరలు పెరిగాయి. దేశ, విదేశీ పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు దృష్టి సారించడం ఆరంభించారు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నానక్‌రాంగూడ, తెల్లాపూర్, నార్సింగి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల సంఖ్య అధికమైంది. హైదరాబాద్ అభివృద్ధికి తిరుగే లేదని భావించే తరుణంలో.. కాంగ్రెస్ గెలవడంతో కొందరు బిల్డర్లలో ఆందోళన పెరిగింది. భవిష్యత్తు ఎలా ఉంటుందేమోనని టెన్షన్ ఆరంభమైంది. కోకాపేట్‌లో ఎకరానికి వంద కోట్లు పెట్టి కొన్న డెవలపర్ల పరిస్థితి ఏమిటి? బుద్వేల్‌లో రూ.40 కోట్ల కంటే ఎక్కువ రేటు పెట్టి కొన్న బిల్డర్ల పరిస్థితి ఏమి కావాలి? అందులో ఎంతమంది డెవలపర్లు ప్రాజెక్టుల్ని ఆరంభిస్తారు? ఎందుకంటే, కోకాపేట్‌లో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఒక్కో ఫ్లాటును అమ్మాలంటే.. చదరపు అడుక్కీ కనీసం 14 వేలు పెట్టాలి. బుద్వేల్‌లో అయితే 7 నుంచి 8 వేలు పెట్టాలి. మరి, ప్రభుత్వం మారిన నేపథ్యంలో, అంతంత రేటు పెట్టి పెట్టుబడిదారులు ఫ్లాట్లను కొనుగోలు చేస్తారా? అనే సందేహం సర్వత్రా నెలకొంది. కాబట్టి, హైదరాబాద్ రియల్ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్నహస్తాన్ని అందించాలి.