చెరువును ఆక్రమించారంటూ దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఓ బిల్డర్ కు లీగల్ నోటీసు జారీ చేశారు. బెంగళూరు అర్బన్ జిల్లా జిగానీలో హెన్నగారా చెరువును బిల్డర్ ఆక్రమించారని, ఇది కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ (సవరణ) చట్టం, 2007కి వ్యతిరేకమని పేర్కొంటూ డిసెంబర్ 10న జిగానీ సిటీ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బిల్డర్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో తమ ముందు వెంటనే హాజరుకావాలని ఆదేశించారు. 32 సర్వే నెంబర్లలో భూమిని ఆ బిల్డర్ ఆక్రమించారని తమకు ఫిర్యాదు అందిందని, సదరు భూమికి సంబంధించిన పత్రాలను ఫిర్యాదుదారు అందజేస్తే తదుపరి విచారణ జరుపుతామని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. కొన్ని వారాలుగా లేక్ బెడ్ సమీపంలో ఎలాంటి అనుమతులూ లేకుండా మట్టి పోస్తున్నారని తమకు ఫిర్యాదు అందినట్టు చెప్పారు.