2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదల వంటి ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, గృహరుణ రంగం బాగానే పురోగమించింది. కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మన హౌసింగ్ రంగం ఆకర్షణ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇళ్లకు డిమాండ్ పెరగడమే ఇందుకు నిదర్శనం. 2023-24 మొదటి అర్థ భాగంలో జీడీపీ గతేడాదితో పోలిస్తే 7.7 శాతం వృద్ధి సాధించింది. కరోనా సమయంలో జీడీపీ బాగా దెబ్బతింది. కరోనా తర్వాత ఇది గణనీయమైన పురోగతి కనబర్చింది. కరోనా తర్వాత పరిస్థితులు ఇళ్లకు డిమాండ్ ను బాగా పెంచాయి. అలాగే స్థిరమైన వడ్డీ రేట్లు, సానుకూల వృద్ధితో రియల్ ఎస్టేట్ మార్కెట్ గాడిలో పడింది. ఇళ్ల కొనుగోలుదారులు చాలా విశ్వాసంతో ఇంటి కొనుగోలు నిర్ణయాలు తీసుకున్నారు. మనదేశంలో అత్యధికంగా పనిచేసే వయసు కలిగిన జనాభా ఉండటం వల్ల సరసమైన ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సాంకేతికతదే కీలకపాత్ర
సాంకేతికత ఏకీకరణ, మఖ్యంగా ఏఐ ఆధారిత మదింపులు, బ్లాక్ చెయిన్ అంశాలు 2023లో ఇళ్ల రుణాల కార్యాచరణ సామర్థ్యాన్ని డైనమిక్ గా మార్చింది. కరోనా సమయంలో డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఆన్ లైన్ కు మారింది. అనంతరం ఇదే పద్ధతి కొనసాగుతోంది. వీటికి సంబంధించి చాలా అంశాల్లో సాంకేతికతే కీలకపాత్ర పోషిస్తోంది.
2024 ట్రెండ్ ఎలా?
2024లో భారతదేశంలో గృహరుణాల ట్రెండ్ పథం రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. అలాగే జీడీపీ వృద్ధి, ఉపాధి రేట్లు వంటి ఆర్థిక అంశాలతోనూ ముడిపడి ఉంటుంది. సరసమైన ఇళ్లపై ప్రభుత్వ విధానాలు, పన్ను నిబంధనలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, అనుకూలమైన తనఖా రేట్లు రియల్ పరిశ్రమ మరింత ముందుకు వెళ్లడానికి సహకరిస్తాయని చెబుతున్నారు.