హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ వెనుక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు బయటికొచ్చింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన, ఏసీబీ కస్టడీలో 8 రోజులు ఉండి, విచారణ ఎదుర్కొన్న బాలకృష్ణ.. కీలక విషయాలు బయట పెట్టాడు. శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగులకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలిపాడు.
పలుసార్లు నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. నార్సింగిలోని ఒక వివాదాస్పద భూమికి సంబంధించి.. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే.. 12 ఎకరాల భూమికి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు. నార్సింగిలోని ఒక ప్రాజెక్ట్ అనుమతి కోసం అరవింద్ కుమార్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నాడు. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతికి కోటి రూపాయలు డిమాండ్ చేసాడని వెల్లడించాడు. ఈ క్రమంలో శివబాలకృష్ణ ఫోన్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఐఏఎస్ అధికారితో చేసిన చాట్స్, కాల్ రికార్డ్స్ వివరాలను బయటికి తీస్తున్నారు. ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెప్పిన ఫైళ్లను క్లియర్ చేసినట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. కస్టడీలో శివ బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా.. ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను ఏసీబీ విచారిస్తుందని సమాచారం.