టాలీవుడ్ నటుడు శివ కందుకూరి
టాలీవుడ్ నటుడు, చూసీ చూడంగానే సినిమా ఫేమ్ శివ కందుకూరి విలాసవంతమైన ఇల్లు ఎలా ఉందో, ఆయన తన భూలోక స్వర్గాన్ని ఎలా నిర్మించుకున్నారో ఓ సారి చూద్దామా? ‘నా మొదటి చిన్ననాటి ఇల్లు మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఉంది. నేను 1995 సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో మా బంగ్లా మాత్రమే అక్కడ ఉండేది. కొండ ప్రాంతంలోకి వెళ్లే ఆ సందుల్లో చాలా దూరం నడిచినట్టు నాకు గుర్తుంది. మా అమ్మతో కలిసి నడవడమే కాదు..
ఆమె చెప్పే కథలు కూడా వింటూ వెళ్లేవాడిని’ అని శివ వివరించారు. ఆయన తన ఇంట్లో ఆహ్లాదకరమైన, స్వాగతించే వాతావరణం ఉండడాన్ని బాగా ఇష్టపడతారు. ‘నేను విదేశాలలో చదువుకున్నప్పటికీ, ఇప్పటికీ మినిమలిజాన్నే ఇష్టపడతాను. మా ఇంట్లో గోడలపై వేలాడుతున్న కళాఖండాలు, చిత్రాలేవీ లేకపోవడాన్ని చూస్తే పాఠకులు ఆశ్చర్యపోవచ్చు. మా ఇంట్లో కేవలం నాలుగు సాధరణమైన గోడలు మాత్రమే ఉన్నాయి’ అని తెలిపారు.
తన ఇంటి గురించి శివ కందుకూరి ఇంకా వివరిస్తూ.. ‘నేను సౌకర్యవంతమైన అంశాలన్నింటినీ ఆస్వాదిస్తున్నాను. నేను నా ఇంట్లో వెతుకున్నదంతా సౌకర్యంగానే ఉంటుంది. ఎందుకంటే నేను పరిపూర్ణమైన ఇంటిని సృష్టించాలనుకోవడంలేదు. కానీ నాకు మంచి లైటింగ్, డిజైన్ మాత్రం కావాలి. నా ఇంట్లో ఉన్న వాతావరణాన్ని చూసి నేను గర్వించేలా ఉండాలి. అందమైన ఫర్నిచర్ కంటే ఆహ్లాదకరమైన ఇల్లు చాలా బాగుంటుంది. నేను ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతాను కాబట్టి, అక్కడి అంశాలు నా సాధారణ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు.
శివకు గాలి, వెలుతురు బాగా వచ్చే గది అంటే చాలా ఇష్టం. అదే సమయంలో ఎలాంటి కృత్రిమత ఉండకూడదు. నేచురల్ స్టార్ నానీ ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే ఉంటుందని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘నానీ తన సినిమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సినిమా టైటిల్స్ అన్నీ చాలా వ్యూహాత్మకంగా అమర్చుకున్నారు. గదిలో స్పాట్ లైట్లు వేయగానే అవి ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలపై ఫోకస్ అవుతాయి. భవిష్యత్తులో నా సినిమాలకు సంబంధించి కూడా ఇలాంటి గది వస్తుందని భావిస్తున్నాను’ అని ముగించారు.