దేశంలోకి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు (పీఈ పెట్టుబడులు) వెల్లువలా వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత రియల్ రంగంలోకి వచ్చాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ. గతేడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.
ఇక ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 995.1 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. తాజా క్వార్టర్లో 154 శాతం పెరుగుదల కనిపించింది. ఇక ఈ మొత్తం పీఈ పెట్టుబడుల్లో ఇండస్ట్రియల్ అండ్ వేర్ హౌసింగ్ విభాగం 61 శాతం (1.5 బిలియన్ డాలర్లు)తో మొదటి స్థానంలో ఉందని కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఇండస్ట్రియల్ అండ్ వేర్ హౌసింగ్ విభాగంలో ఈ ఒరవడి ఈ ఏడాది కూడా కొనసాగుతుందని కొలియర్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్ విమల్ నాడార్ అభిప్రాయపడ్డారు. ఈ విభాగం తర్వాత 543.5 మిలియన్ డాలర్ల పెట్టబడులతో రెసిడెన్షియల్ సెక్టార్ రెండో స్థానంలో ఉంది.