ముంబై వంటి నగరాల్లో పెరుగుతున్న పోకడ
డెవలపర్లు, నివాసితులు, ప్రభుత్వానికి లాభదాయకం
కాలంతోపాటే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తర్వాత సొంతింటి అవసరం ఏమిటో జనాలకు తెలియడంతో అందరూ తమ తొలి ప్రాధాన్యం ఇంటికే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో రియల్ రంగం చక్కని పనితీరు కనబరుస్తోంది. ఈ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లు వస్తూనే ఉన్నాయి.
గతంలో అపార్ట్ మెంట్లకు డిమాండ్ ఉండగా.. తర్వాత బంగ్లాలు, విల్లాలు, రో హౌస్ లు, ఆకాశహర్మ్యాలు.. ఇలా కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రీ డెవలప్ మెంట్ అనే ట్రెండ్ మొదలైంది.
ముంబై వంటి రద్దీ నగరాల్లో ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. పట్టణీకరణ పెరగడం, భూమి లభ్యత తక్కువగా ఉండటంతో ముంబైలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. అయినప్పటికీ డిమాండ్ కు తగిన లభ్యత లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఫ్లాట్లను రీ డెవలప్ చేయడం ఓ మంచి మార్గంగా మారింది. చాలా పాత భవనాల్లో ఆధునిక సౌకర్యాలు లేవు. అలాగే నిర్మాణపరమైన సమస్యలు కూడా ఉంటాయి. దీంతో అలాంటి ప్రాజెక్టులను రీ డెవలప్ మెంట్ చేయడం ద్వారా కొత్త, ఆధునిక నివాసాలు పొందే అవకాశం ఉంది.
ఇది అటు నివాసితులు, ఇటు డెవలపర్లకు కూడా ప్రయోజనకరంగా ఉండటంతో పలువురు రియల్టర్లు రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల నివాసితులకు అప్ గ్రేడ్ చేసిన అపార్ట్ మెంట్లు లభిస్తాయి. అదే సమయంలో డెవలపర్లు కొత్త యూనిట్లు నిర్మించి విక్రయించుకోవచ్చు. పెరిగిన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది.
రీ డెవలప్ మెంట్ లోనూ పలు రకాలున్నాయి. ఇందులో క్లస్టర్ రీ డెవలప్ మెంట్ ఒకటి. ఇరుగు పొరుగున ఉన్న కొన్ని సొసైటీలను కలిపి ఓ పెద్ద ప్రాజెక్టుగా మెరుగైన మౌలిక వసతులతో రీ డెవలప్ మెంట్ చేస్తారు. అలాగే ఒకే సొసైటీని కూడా మళ్లీ కొత్తగా అదనపు హంగులు, అంతస్తులతో రీ డెవలప్ మెంట్ చేయడం మరో రకం. అయితే, ఇందులోనూ కొన్ని సవాళ్లున్నాయి.
రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం అందులో ఉండే నివాసితులందరి ఆమోదం పొందడం కొంత క్లిష్టమైన అంశం. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలు కూడా కాస్త సవాల్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు, ప్రభుత్వం మధ్య సహకారం ఉంటే ఆమోదాలు క్రమపద్ధతిలో లభిస్తాయి. తద్వారా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు మరింత సమర్థవంతంగా పూర్తవుతుంది.
రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులు చేపట్టే డెవలపర్లకు మహారాష్ట్ర సర్కారు కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. లీజు భూమిని ఫ్రీహోల్డ్ ల్యాండ్‌గా మార్చడానికి ఇటీవల ప్రీమియంలను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని లీజు భూమిపై రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు, ప్రీమియం కేవలం ఐదు శాతానికి తగ్గించింది.
అలాగే క్లస్టర్ రీడెవలప్‌మెంట్ కోసం ప్రీమియంలో 50% రాయితీ ఇస్తోంది. ఇది రీ డెవలప్ మెంట్ తోపాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచగల పెద్ద-స్థాయి ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. మొత్తమ్మీద రీ డెవలప్ మెంట్ అనేది డెవలపర్లు, నివాసితులు, నగరాలకు ప్రయోజనాలు అందిస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ లో ఈ ట్రెంట్ పెరుగుతోంది.