రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రణాళిక
బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 43 ప్రాజెక్టులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, గోవా, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చిల్లో రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ విభాగాల్లో 92 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టులు చేపట్టనుంది. దీంతోపాటు ఆతిథ్య రంగంలో కూడా 2034 గదులతో కూడిన 10 ప్రాజెక్టుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కు సంబంధించి 90 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితోపాటు 955 గదులతో మూడు హోటళ్లు కూడా నిర్మిస్తోంది.
ప్రస్తుతం ఈ కంపెనీకి బెంగళూరు, మంగుళూరు, మైసూరు, పుణెల్లో 260 ఎకరాల భూమి ఉంది. కాగా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.307 కోట్ల నికరలాభం పొందింది. అయితే, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3.4 శాతం తక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1680.9 కోట్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇది 1862.1 కోట్లుగా ఉంది. అమ్మకాలపరంగా బెంగళూరు (43శాతం), హైదరాబాద్ (32శాతం), ముంబై (23శాతం) చక్కని పనితీరు కనబరిచినట్టు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ తెలిపారు. వచ్చే త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఢిల్లీ-ఎన్ సీఆర్ లో మూడు ప్రాజెక్టులతో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నట్టు చెప్పారు.
కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే.. రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో 73 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 28 ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సన్నాహాలు చేస్తోంది. బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, గోవాలలో ఈ ప్రాజెక్టులు చేపట్టనుంది. కంపెనీ ప్రస్తుతం 66 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 39 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. వీటిలో ఎక్కువ భాగం బెంగళూరులో ఉండగా.. తర్వాత ముంబై, హైదరాబాద్ లలో ఉన్నాయి. అలాగే 8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు కమర్షియల్ ప్రాజెక్టులు కూడా చేపడుతోంది.
ఇవి బెంగళూరు, చెన్నై, కొచ్చిల్లో ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో 23 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 12 కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. రిటైల్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం బెంగళూరులో మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ప్రాజెక్టు నిర్మస్తుండగా.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, గోవాల్లో 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 ప్రాజెక్టులు లాంచ్ చేయనుంది.