తగ్గుతున్న కొత్త ఇంటి ధరలు
పొరుగుదేశం చైనాలో కొత్త ఇళ్ల ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. 2015 నుంచి చూస్తే ఈ ఏడాది అక్టోబర్ లో ఇవి మరింత తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది అక్టోబర్ లో కొత్త గృహాల ధరలు 5.9 శాతం మేర పడిపోయాయి. సెప్టెంబర్ లో ధరలు 5.8 శాతం తగ్గా.. ఇప్పుడు మరింత క్షీణించాయి. వరుసగా 16వ నెల ఇళ్ల ధరలు తగ్గడం గమనార్హం. అయితే, నెలవారీ తగ్గుదల రేటు కాస్త తగ్గిందని, ప్రాపర్టీ సెక్టార్ కు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు చర్యలు పని చేయడం ప్రారంభమయ్యాయని చైనా పేర్కొంటోంది.
నెలవారీగా ఇళ్ల ధరలు తగ్గుముఖ పట్టడం గత కొంత కాలంగా జరుగుతోంది. చైనాలోని ప్రధాన నగరాలతోపాటు టైర్-2, టైర్-3 పట్టణాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గిపోయింది. దాంతో కొత్త ఇళ్ల ధరలు తగ్గిపోతున్నాయి. అయితే, సమీప భవిష్యత్తులో ఇది మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇళ్ల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని 75.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇటీవల చేసిన సర్వేలో 70 నగరాల్లో కేవలం మూడింటిలో మాత్రమే అక్టోబర్ లో ఇళ్ల ధరలు పెరిగాయి.