- 2024లో భారత రియల్ రంగంలో రెసిడెన్షియల్ విభాగం సత్తా ఇదీ
- స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడి
భారత స్థిరాస్తి రంగం 2024లో సత్తా చాటింది. ముఖ్యంగా రెసిడెన్షియల్ విభాగం హవా కనబరిచింది. ఈ సంవత్సరంలో 5.77 లక్షల రెసిడెన్షియల్ లావాదేవీలు జరగ్గా.. వాటి విలువ రూ.4 లక్షల కోట్లు దాటింది. గతేడాదితో పోలిస్తే లావాదేవీలపరంగా 4 శాతం, విలువపరంగా 2 శాతం వృద్ధి నమోదైంది. 2023లో 5.56 లక్షల లావాదేవీలు జరగ్గా.. వాటి విలువ రూ.3.95 లక్షల కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో 2023తో పోలిస్తే.. 2024లో రియల్ రంగం పరిస్థితి ఆశాజనకంగానే ఉందని స్క్వేర్ యార్డ్స్ తాజా నివేదిక విశ్లేషించింది.
1.3 లక్షల యూనిట్లు, రూ.1.6 లక్షల కోట్లతో విలువైన లావాదేవీలతో ముంబై మొదటి స్థానంలో ఉండగా.. రూ.60వేల కోట్ల విలువైన ఇళ్లు 80వేల యూనిట్లతో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన ఇళ్లు, లక్ష యూనిట్లతో పుణె మూడో స్థానంలో ఉంది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లో పశ్చిమ భారతదేశం ఆధిపత్యం చెలాయించింది. ముంబై, థానే, నవీ ముంబై, పుణె వంటి నగరాలు మొత్తం లావాదేవీల్లో 61 శాతం, మొత్తం అమ్మకపు విలువలో 69 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఇక దక్షిణ భారతదేశంలో జరిగిన లావాదేవీల్లో బెంగళూరు, హైదరాబాద్ కలిసి 25 శాతం వాటాతో ఉన్నాయి. బెంగళూరులో 80వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ రియల్ రంగం తన సత్తా చాటింది. దాదాపు 64వేల రెసిడెన్షియల్ లావాదేవీలతో రియల్ ఎస్టేట్ హబ్ గా తన స్థానాన్ని భాగ్యనగరం సుస్థిరం చేసుకుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశ నగరాలు లావాదేవీల సంఖ్యపరంగా ముందు ఉండగా.. గురుగ్రామ్ వంటి ఉత్తర భారతదేశ నగరాలు ధరల పెరుగుదలలో పైకి ఎగబాకాయి.
గురుగ్రామ్ లో ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో 132 శాతం మేర పెరిగాయి. లగ్జరీ, అల్ట్రా-లగ్జరీ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా గురుగ్రామ్ ప్రాపర్టీ ధరలు 2019లో చదరపు అడుగు రూ.5,820 ఉండగా.. 2024నాటికి 132 శాతం పెరుగుదలతో రూ.13,500కి పెరిగింది. గ్రేటర్ నోయిడా, నోయిడా గత ఐదేళ్లలో ప్రాపర్టీ ధరలు 67 శాతం పెరుగుదలతో రూ.4500 నుంచి రూ.7500కి పెరిగాయని నివేదిక వెల్లడించింది. బెంగళూరులో ఇళ్ల ధరలు 66 శాతం వృద్ధితో రూ.5,450 నుంచి రూ.9,050కి పెరిగాయి.
డెవలపర్లు 2024లో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించారని, ప్రధాన నగరాల్లో 3.9 లక్షల కొత్త యూనిట్లను ప్రారంభించి, 4 లక్షల యూనిట్లకు పైగా డెలివరీ చేశారని నివేదిక పేర్కొంది. ‘ప్రధాన డెవలపర్లు 2025 ఆర్థిక సంవత్సరంలో 300 మిలియన్ చదరపు అడుగుల మేర ఇళ్లను పూర్తి చేసే కృషితో ముందుకెళ్తున్నారు. ఈ బలమైన పైప్‌లైన్.. లావాదేవీల సంఖ్యను మరింత పెంచుతుంది. ఇది విభిన్న కొనుగోలుదారుల ప్రాధాన్యతలను తీరుస్తుందని భావిస్తున్నాం. భారతీయ ప్రాపర్టీ విభాగం పనితీరు మహమ్మారికి ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది’ అని అని నివేదిక పేర్కొంది.