ప్రభుత్వానికే టోకరా వేసి అక్రమంగా ఫ్లాట్లను అమ్మేసిన ఓ నిర్మాణ సంస్థ, దాని డైరెక్టర్లపై కేసు నమోదైంది. రీ డెవలప్ మెంట్ తర్వాత రూ.3.52 కోట్ల విలువైన ఆరు ప్లాట్లను మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథార్టీకి(ఎంహెచ్ఏడీఏ) అప్పగించకుండా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినందుకు ఎస్ కే రియల్టీ సంస్థ, దాని డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. టార్డియోలోని గిల్డర్ లేన్ లో ఉన్న వాడియా హౌస్ ను 2009లో రీ డెవలప్ మెంట్ కోసం ఎస్ కే రియల్టీ సంస్థకు ఎంహెచ్ఏడీఏ అప్పగించింది. ఆ భవనానికి కొత్తగా మంజూరు చేసిన అదనపు నిర్మాణ ప్రాంతాన్ని ఎంహెచ్ఏడీఏకి తిరిగి ఇవ్వాలనే నిబంధనతో ఒప్పందం కుదిరింది.
ఈ నేపథ్యంలో ఆ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అందులోని 501, 503, 504, 505, 702, 703 అనే ఆరు ఫ్లాట్లను ఎంహెచ్ఏడీఏకి ఇవ్వాలి. వాటి విలువ దాదాపు రూ.3.52 కోట్లు. అయితే, నిర్మాణ సంస్థ ఆ ఫ్లాట్లను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. దీనిపై నిర్మాణ సంస్థకు ఎంహెచ్ఏడీఏ పలుమార్లు నోటీసులు పంపించినా.. స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్ కే రియల్టీ (గతంలో ఓం డెవలపర్స్), దాని భాగస్వాములు శాంతిలాల్, మఖేదా, అన్సాబెన్, మఖేదా, హేమంత్ మఖేదా, మాధవి మఖేదాపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు.