గ్రేటర్ హైదరాబాద్లో ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న నార్సింగి.. ఇప్పుడు కనివినీ ఎరుగని రీతిలో మారిపోయింది. అందుకే హైదారాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నార్సింగి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహానగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇదొక్కటి. కేవలం 20 ఏళ్లలో నార్సింగి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే గత పదేళ్లలో ఈ ప్రాంతం.. అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మొదలైనప్పుడు రెండు వేల రూపాయలూ పలకని చదరపు గజం ఇప్పుడు లక్షన్నర పైమాటే.
ఒకప్పుడు గ్రామంగా ఉన్న నార్సింగి ఇప్పుడు హైదరాబాద్లో ప్రముఖ ప్రాంతం అయిపోయింది. గ్రేటర్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ కేక్ అయ్యింది. హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాంతాలతో పోటీ పడుతోంది. ముఖ్యంగా నార్సింగి ప్రముఖులకు నివాస ప్రాంతంగా మారిపోయింది. ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నివసించిన సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఇప్పుడు నార్సింగికి నివాసం మార్చుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నుంచి నార్సింగికి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే. అదే ఫిల్మ్ నగర్ నుంచి 6 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక ఐటీ కారిడార్ గచ్చిబౌలి నుంచి కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు. అటు మెహిదీపట్నం నుంచి 15 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పోరేట్ హాస్పిటల్స్, భారీ షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ ధియేటర్స్.. ఇలా కావాల్సినవన్నీ నార్సింగిలో అందుబాటులో ఉన్నాయి. కోఠి, సికింద్రాబాద్, మెహిందీపట్నం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అంతేకాదు రాయదుర్గం మెట్రో స్టేషన్ కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉండటంతో నార్సింగి కనెక్టివిటీకి ఏ మాత్రం సమస్య లేదు.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2005లో ఇక్కడ చదరపు గజం కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే. ఆ తరువాత మెల్లమెల్లగా నార్సింగి రియల్టీ ప్రాజెక్టులు క్రమక్రమంగా మొదలయ్యాయి. స్టాండ్ ఎలోన్ అపార్ట్ మెంట్ లు, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. నార్సింగిలో పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం భారీగా హైరైజ్ అపార్ట్ మెంట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. 20 ఏళ్ల క్రితం చదరపు గజం రెండు వేల రూపాయలున్న ధర.. ఇప్పుడు మెయిన్ రోడ్డుకైతే చదరపు గజం 2 లక్షలు, కాస్త లోపలికి వెళితే చదరపు గజం 1.5 లక్షల మేర ధరలు పలుకుతున్నాయి. ఇక పదేళ్ల క్రితం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 2,500 ఉండగా.. ఇప్పుడు చదరపు అడుగు ప్రాజెక్టును బట్టి 8 వేల నుంచి 15 వేల రూపాయల వరకు ధరలున్నాయి. నార్సింగిలో ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవీ గ్రూప్ అట్లాంటీస్ పేరుతో నిర్మిస్తున్న హైరైజ్ ప్రీమియం అపార్ట్ మెంట్ ప్రాజెక్టులో ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ 2 కోట్ల రూపాయలుగా ఉంది.