నవాబుల కుటుంబానికి చెందిన డాక్టర్ మీర్ నాసీర్ అలీ ఖాన్ పూర్వీకులు ఉజ్బెకిస్థాన్ దేశానికి చెందినవారు. ఆయన పూర్వీకులు రెండు శతాబ్దాల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాజవంశానికి చెందిన ఆయనకు వారసత్వంగా అనేక కట్టడాలు సంక్రమించాయి. వాటిలో కొన్నింటినీ డెవలపర్లకు ఒప్పందానికి ఇవ్వగా.. వారు సకాలంలో నాణ్యతతో కట్టకపోవడం వల్ల.. ఆయనే స్వయంగా డెవలపర్‌గా అవతారమెత్తారు. నాలెడ్జి సిటీగా అవతరించిన హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో బీటీఆర్ గ్రీన్స్ ప్రాజెక్టును ఆరంభించారు. నైన్ హోల్ గోల్ఫ్ కోర్సు గల ప్రపంచ స్థాయి గేటెడ్ కమ్యూనిటీ బీటీఆర్ గ్రీన్స్‌ని 250 ఎకరాల్లో నిర్మించారు. 2021లో ఆయన తెలుగు రాష్ట్రాలకు కజకిస్థాన్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని భారత రాష్ట్రపతి ధృవీకరించారు. వచ్చే ఐదేళ్లపాటు సస్టెయినబుల్ డెవలప్మెంట్ మీద దృష్టి సారించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
కెనడా సంస్థతో ఒప్పందం
ప్రకృతి పట్ల ప్రేమ ఉన్న బిల్డర్లు కార్బన్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉష్ణోగ్రతలు అధికమై సముద్రమట్టాలు పెరిగితే కొన్ని ద్వీపాలు తుడుచుకుపోయే ప్రమాదముంది. తీరంలో ఉండే నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన డెవలపర్‌గా ప్రకృతిని పరిరక్షిస్తూ నిర్మాణాల్ని చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో వుడ్ హౌసింగ్ విభాగంలోకి కాస్త ఆలస్యంగానే ప్రవేశించాను. కలప గృహాలకు విపరీతమైన గిరాకీ ఉంది. కాకపోతే వీటిని నిర్మించేవారు తక్కువున్నారని అర్థమైంది. ఇందుకోసం తొలుత కెనడా బ్రిటిష్ కొలంబియాకు చెందిన క్రౌన్ ఏజెన్సీ అయిన ఎఫ్ఐఐ ఇండియా (ఫారెస్ట్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్‌మెంట్)తో చర్చించాను. కెనడాకు వెళ్లి కలప గృహాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞనాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆతర్వాత ఎఫ్ఐఐతో ఒప్పందం చేసుకుని హైదరాబాద్‌లో తొలి పైలట్ ప్రాజెక్టును వచ్చే అక్టోబరులో ఆరంభిస్తున్నాం. ఇది మూడు నెలల్లో పూర్తవుతుంది. జనవరిలో ప్రారంభించి.. యాభై నుంచి వంద కలప గృహాల్ని నిర్మించాలని ఉంది. వీటి విస్తీర్ణం ఎంతలేదన్నా ఐదు వేల చదరపు అడుగుల దాకా ఉంటుంది. అంతకంటే పెద్ద గృహాలు కావాలన్నా కడతాం. ఈ తరహా కట్టడాల్ని కట్టాలంటే చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ..4000 నుంచి రూ.5 వేల దాకా ఖర్చవుతుంది. చిన్న గృహాలు అంటే వెయ్యి చదరపు అడుగుల్లోనూ కలప గృహాల్ని కట్టుకోవచ్చు.
కలపతో కలకాలం లాభమే..
కాంక్రీటుతో ఒకసారి ఇల్లు కట్టిన తర్వాత.. మరోసారి వాడలేం. కానీ, కలపతో ఇల్లు నిర్మించాక.. దాన్ని కూల్చివేసిన తర్వాత మళ్లీ వాడుకోవచ్చు. పైగా, ఇది బ్యాక్టీరియాను నశింజేస్తుంది.
* కాంక్రీటుతో పోల్చితే కలప గృహాలు ఐదు రెట్లు తక్కువ బరువుతో ఉంటాయి. దృఢంగా, మన్నికగా నిలుస్తాయి.
* అగ్నివ్యాప్తిని పూర్తిగా నిరోధిస్తుంది. అంత సులభంగా కాలిపోయే ప్రసక్తే ఉండదు. పైగా, స్వయంగా మంటని ఆర్పివేసే విధంగా కొన్ని డిజైన్లున్నాయి.
* ఇటుక, కాంక్రీటుతో కట్టడం కంటే ఇంటిని నిర్మిస్తే ఇంట్లోకి వేడి అనేది రాదు. ఫలితంగా విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. చలికాలంలో లోపలంతా వెచ్చగా ఉంటుంది. ఎంతలేదన్నా యాభై నుంచి అరవై శాతం ఏసీ వాడకం తగ్గుతుంది.
* కాంక్రీటు నిర్మాణాలతో పోల్చితే కలప కట్టడాలు త్వరగా పూర్తవుతాయి. ఫలితంగా, కార్మికుల కోసం అయ్యే వ్యయం గణనీయంగా తగ్గుతుంది. దీంతో అటు డెవలపర్లకు ఇటు కొనుగోలుదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
* కలప సహజసిద్ధమైనది కావడం వల్ల ఇంటి నిర్మాణ పనులు సులువుగా జరుగుతాయి.
* ప్రస్తుతం జీవనం ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. మానసిక కష్టాలు, ఆతృత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివన్నీ కలప, మొక్కలు కలిసి దూరం చేస్తాయి.
* కలప ప్రత్యేకత ఏమిటంటే.. కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకుంటాయి.
* కలపతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఎలాంటి నిర్మాణ సామగ్రి అయినా వాడుకోవచ్చు. కలప, గ్రానైట్, మార్బుల్, టైల్ వంటివి వినియోగించవచ్చు.
ఈ రాయితీలు కావాలి..
* పర్యావరణ గృహాలు అందుబాటులోకి వస్తే పర్యావరణాన్ని పరిరక్షించినట్లే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గృహాల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలను అందజేయాలి.
* స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అనుమతుల ఫీజుల్ని తగ్గించాలి
* నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గించాలి
* దిగుమతి సుంకంపై రాయితీల్ని అందజేయాలి