విష్ణువర్దన్ రాజు,రిటైర్డ్ జిల్లా రిజిస్ట్రార్, దక్షిణ హైదరాబాద్.
రిజిస్ట్రేషన్ రుసుము కేవలం సేవా రుసుము గానే భావించాలి తప్ప.. ఆదాయం మార్గంగా ఎట్టి పరిస్థితుల్లో భావించకూడదు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు భూముల విలువల్ని ఏడాదికోసారి సవరించేవి. మరి, అప్పట్లో వ్యతిరేకించిన వారే ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి? ప్రజల మీద అధిక భారం పడకుండా ఎంత జాగ్రత్త తీసుకోవాలి. మరి, అలాంటి కసరత్తు ఏమాత్రం జరగలేదని తాజాగా పెంచిన రుసుముల్ని క్షుణ్నంగా గమనిస్తే అర్థమవుతోంది. స్టాంపు డ్యూటీకి మరియు రిజిస్ట్రేషన్ రుసుము మధ్య తేడా తెలియకపోవడం వలన ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ రుసుమును సవరించింది. దాదాపు 52 రకాల రుసుములను తెలంగాణ సొసైటీస్ చట్టం మరియు చిట్ ఫండ్ చట్టం 1982కు సంబంధించిన రుసుముల్ని సవరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణ లక్ష్యాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని సవరించినట్లు అనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలను రిజిస్ట్రేషన్ చేసి అట్టి రికార్డుల్ని శాశ్వతంగా భద్రపరచడమే. ఈ క్రమంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు రెండు రకాలుగా రుసుమును వసూలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఒకటి స్టాంపు డ్యూటీ, రెండోది రిజిస్ట్రేషన్ రుసుము. స్టాంప్ డ్యూటీ రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే మార్గంగా.. రిజిస్ట్రేషన్ రుసుము సేవకు సంబంధించిన రుసుముగా వసూలు చేస్తారు.
ఇంతింత బాదుడా?
స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ రుసుము రెండు దేనికదే ప్రత్యేకంగా.. ఒక దానికి మరొకటి సంబంధం లేకుండా వసూలు చేస్తారు. వివిధ రకాలైన దస్తావేజులకు సంబంధించి రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేస్తారు. ముఖ్యంగా క్రయ దస్తావేజులు, దాన సెటిల్మెంట్ వంటి దస్తావేజులకు.. దస్తావేజు విలువలో అర శాతం రిజిస్ట్రేషన్ రుసుముగా వసూలు చేసేవారు. మిగితా కొన్ని రకాలైన దస్తావేజులకు స్థిరమైన రిజిస్ట్రేషన్ రుసుము 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా వసూలు చేసేవారు. కానీ, ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. రిజిస్ట్రేషన్ రుసుము సేవా రుసుముగా కాకుండా ఆదాయ మార్గంగా భావించి వసూలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఏరియా పరిధిలో జరిగే స్థిరాస్తుల క్రయ దస్తావేజు మరియు మార్పిడి దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు రెండు శాతం రుసుమును నిర్థారించారు. గ్రామపంచాయతీ పరిధిలో జరిగే స్వాధీనం యొక్క రిజిస్ట్రేషన్ రుసుము 1.6% శాతంగా నిర్ధారించారు. ఈ వర్గీకరణ దస్తావేజులు అన్నింటికీ గతంలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుము ఉండేది. వర్గీకరణ 2 అనగా కేటగిరి 2 లో కుటుంబ సభ్యుల మధ్య జరిగే దాన సెటిల్మెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రుసుములు పూర్వము 0.5% శాతంతో పాటుగా పదివేల రూపాయలు గరిష్టంగా వసూలు చేసేవారు. ప్రస్తుతం ఈ కేటగిరీ దస్తావేజులకు కనీసం రుసుము రెండు వేల రూపాయలు, గరిష్టంగా రూ.25,000గా నిర్ణయించారు.
గరిష్ఠంగా.. రూ.లక్ష
కేటగిరీ- 2 కింద వర్గీకరించిన గ్రామపంచాయేతర సంస్థలకు చేయాల్సిన దాన సెటిల్మెంట్లు మరియు కుటుంబేతర సభ్యుల మధ్యన జరిగే సెటిల్మెంట్లకు కనిష్ట రిజిస్ట్రేషన్ రుసుము అర శాతం నుంచి గరిష్టంగా ఒక లక్ష రూపాయలుగా నిర్ణయించారు. గతంలో ఇదే లావాదేవీలకు గరిష్ట రుసుము పది వేల రూపాయలుండేది. ఈ విధంగా కేటగిరి- 2లో గల 12 రకాలైన దస్తావేజులు మీద రిజిస్ట్రేషన్ రుసుము అత్యధికంగా విధించారు. ఏ రకమైన విక్రయాలకు సంబంధించి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్ రుసుము రెండు వేల నుండి గరిష్టంగా 20,000 చేయడం అసమంజసం. ప్రతిఫలంతో ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీకి కనిష్ఠ రుసుము ₹5000, గరిష్టంగా లక్ష రూపాయలు విధించడం శోచనీయం.
మీ అభిప్రాయాల్ని regnews21@gmail.comకి మెయిల్ చేయండి.