poulomi avante poulomi avante

విలువ‌ల‌తో కూడిన వ్యాపారం చేయాలి 

  • అప్పుడే నిర్మాణ రంగంలో నిల‌బ‌డ‌తారు
  • ఏజెంట్ల‌కు 6-10 శాతం క‌మిష‌న్ ఇస్తున్న డెవ‌ల‌ప‌ర్లు
  • ఇదే విధానం కొన‌సాగితే భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థకమే
  • బిల్డ‌ర్లు స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అల‌వ‌ర్చుకోవాలి

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌ : వారంతా బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లే.. ఇందులో కొత్త‌, పాత అనే తేడా లేదు.. కొంద‌రు చెప్పేవ‌న్నీ మాయమాట‌లే. ఇర‌వై ల‌క్ష‌ల‌కే ఫ్లాటు.. ముప్ప‌య్ ల‌క్ష‌ల‌కే ఇల్లు అంటూ బుట్ట‌లో వేసుకుంటున్నారు. ఏజెంట్ల (రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టెంట్ల‌)కు సుమారు ఆరు నుంచి ప‌ది శాతం క‌మిష‌న్ ఇచ్చి అమాయ‌క కొనుగోలుదారుల్నుంచి వంద శాతం సొమ్మును దండుకుంటున్నారు. ద‌శాబ్దం క్రితం ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులే ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో నెల‌కొంటున్నాయి. డెవ‌ల‌ప‌ర్ల‌కు, కొనుగోలుదారుల‌కు ఎలాంటి ప్ర‌త్య‌క్ష సంబంధం లేకుండా.. కేవ‌లం క‌న్స‌ల్టెంట్ల ద్వారా ఫ్లాట్ల‌ను విక్ర‌యించే విష సంస్కృతికి భాగ్య‌న‌గ‌రంలోనూ బీజం ప‌డింది. ఇదే కొన‌సాగితే.. హైద‌రాబాద్ నిర్మాణ రంగం కోలుకోలేనంత దారుణంగా దెబ్బ‌తినే ప్ర‌మాద‌ముంది. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా విలువ‌ల‌తో కూడిన వ్యాపారం చేస్తేనే నిర్మాణ రంగంలో రాణిస్తారు. లేక‌పోతే, నొయిడా, గుర్గావ్ డెవ‌ల‌ప‌ర్ల త‌ర‌హాలో జైలులో ఊచ‌లు లెక్క పెట్టాల్సి వ‌స్తుంది. కోర్టుల చుట్టూ తిర‌గాల్సి రావొచ్చు.

కొన్నాళ్ల క్రితం.. గుర్గావ్‌, నొయిడాలో కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు ఛాన‌ల్ పార్ట‌న‌ర్ల‌కు ఆరు నుంచి ప‌ది శాతం క‌మిష‌న్ అంద‌జేసి ఫ్లాట్ల‌ను విక్ర‌యించారు. ఎంచ‌క్కా క‌న్స‌ల్టెంట్లు సొమ్ము చేసుకున్నారు. స్థ‌ల య‌జ‌మానికి డ‌బ్బులు బాగానే ముట్టాయి. కానీ, డెవ‌ల‌ప‌ర్లు మాత్రం అడ్డంగా ఇరుక్కుపోయారు. స‌కాలంలో కొనుగోలుదారుల‌కు ఫ్లాట్ల‌ను అందించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇళ్ల కొనుగోలుదారుల‌కు శ‌ఠ‌గోపం పెట్ట‌డంతో కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు ఊచ‌లు ల‌క్క‌పెట్టారు. మ‌రికొంద‌రు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాసుల‌కు కక్కుర్తి ప‌డి.. కొన్నేళ్ల పాటు క‌ష్ట‌ప‌డి సంపాదించిన మంచిపేరును మొత్తం నాశ‌నం చేసుకున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో కొంద‌రు బిల్డ‌ర్లు ఢిల్లీ-ఎన్‌సీఆర్ డెవ‌ల‌ప‌ర్ల అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వినిపిస్తోంది.

Real-Estate-Consultants1.jpg

ఛాన‌ల్ పార్ట‌న‌ర్లుకు..

రెరా అనుమ‌తి తీసుకోకుండా హైదరాబాద్‌లో ఒక డెవ‌ల‌ప‌ర్ 120 ఫ్లాట్ల‌ను విక్ర‌యించాడు. ఎలా అమ్మ‌గ‌లిగాడంటే.. ఛాన‌ల్ పార్ట‌న‌ర్ల‌కు ఆరు శాతం క‌మిష‌న్ ముట్ట‌జెప్పాడు. మ‌రి, అంతంత శాతం క‌మిష‌న్ ఇచ్చి నిర్మాణాలు చేప‌డితే వ్యాపారం వ‌ర్క‌వుట్ అవుతుందా? అంటే స‌రైన స‌మాధానం లేదు. అందుకే, కొంద‌రు ప్రొఫెష‌న‌ల్ బిల్డ‌ర్లు ఛాన‌ల్ పార్ట‌న‌ర్ల మీద ఆధార‌ప‌డ‌కుండా.. వారికి అంత శాతం క‌మిష‌న్లు ఇస్తే వ‌ర్క‌వుట్ అవ్వ‌ద‌న్న ఉద్దేశ్యంతో.. సొంతంగానే అమ్మ‌కాల్ని నిర్వ‌హిస్తున్నారు. మ‌రి స‌మ‌స్య ఎక్క‌డొస్తుందంటే? యూడీఎస్‌, ప్రీ లాంచుల ద్వారా ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్న సంస్థ‌ల‌తోనే!

నిర్మాణ రంగంలోకి కొత్త వ్య‌క్తులు రావాల్సిందే. ఆధునిక పోక‌డ‌లకు శ్రీకారం చుట్టాల్సిందే. కాక‌పోతే, ప్ర‌స్తుతం నిర్మాణ రంగంలోకి విచ్చేస్తున్న వారు రియ‌ల్ రంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వీరంతా యూడీఎస్‌, ప్రీ లాంచుల్లో అమ్మ‌కాల మీద పెట్టే శ్ర‌ద్ధ‌ను.. నిర్మాణాల్ని చేప‌ట్ట‌డంలో చూపెట్ట‌డం లేద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. లేఅవుట్ల‌ను విక్ర‌యించే ఏజెంట్ల‌లో కొంద‌రు ఏకంగా అపార్టుమెంట్లు క‌డ‌తామంటూ ముందుకొస్తున్నారు. వంద శాతం సొమ్ము క‌డితే త‌క్కువ రేటంటూ ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారు. వీరంతా ఆరు నుంచి ప‌ది శాతం సొమ్మును క‌మిష‌న్‌గా అంద‌జేస్తున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల సిస‌లైన బిల్డ‌ర్లు ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంది. మ‌రి, మ‌న హైద‌రాబాద్ మ‌రో ఎన్ సీ ఆర్ కాకూడ‌దంటే ఏం చేయాలి?
నిర్మాణ రంగంలోకి వ‌చ్చే కొత్త డెవ‌ల‌ప‌ర్లు అయినా, పాత బిల్డ‌ర్లు అయినా విలువ‌ల‌తో కూడిన వ్యాపారం చేస్తేనే దీర్ఘ‌కాలంలో నిల‌బ‌డ‌తారు. లేక‌పోతే, ఈ రంగం నుంచి శాశ్వ‌తంగా నిష్క్ర‌మిస్తారు.
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొంద‌రు సులువుగా సొమ్మును సంపాదించ‌డాన్ని అల‌వాటు చేసుకున్నారు. ఎలాంటి క‌ష్టం లేకుండా.. త‌క్కువ రేటుకు ఫ్లాటు అంటూ బోర్డు పెడుతూ సామాన్యుల్ని బుట్ట‌లో వేసుకుంటున్నారు. ఇలాంటి త‌ప్పుడు విధానాల‌కు స్వ‌స్తి ప‌లికి ఇప్ప‌టికైనా డెవ‌ల‌ప‌ర్లు స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అల‌వ‌ర్చుకోవాలి. రెరా అనుమ‌తి తీసుకున్నాకే ప్రాజెక్టుల్ని విక్ర‌యించడాన్ని అల‌వాటు చేసుకోవాలి.
డెవ‌ల‌ప‌ర్లు పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి. స‌కాలంలో ఫ్లాట్ల‌ను కొనుగోలుదారుల‌కు అంద‌జేయాల‌న్న ల‌క్ష్యాన్ని ఏర్ప‌రుచుకోవాలి. నాణ్య‌త విష‌యంలో రాజీప‌డ‌క‌పోతేనే మంచి పేరు సంపాదిస్తారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles