- హాల్ మార్క్ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోపాలకృష్ణ
- 2021 రియల్ రౌండప్
కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగం తొలుత తడబడ్డా.. తర్వాతి కాలంలో నిలబడిందని హాల్ మార్క్ ఇన్‌ఫ్రాకాన్ ఎండీ గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హాల్‌మార్క్ ఇంపీరియో లగ్జరీ విల్లా ప్రాజెక్టుకు రెరా అనుమతి వచ్చిన సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మనదేశంలో పెద్దగా ఉండదని అంచనా వేశారు. అమెరికా, ఐరోపా, అరబ్ వంటి దేశాల్లో కరోనా తీవ్రత పెరిగితే, దాన్ని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగంపై పడుతుందన్నారు. కాకపోతే, ఇక్కడి మార్కెట్ స్థిరపడుతుందే తప్ప పడిపోవడం అంటూ ఉండదని విశ్లేషించారు. యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే అందులోని కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బంది పడతారని వివరించారు.
2021లో వాస్తవ పరిస్థితులు
కరోనా వల్ల పెద్ద ఫ్లాట్లు, వ్యక్తిగత గృహాలు, ఫామ్ హౌజ్ లేఅవుట్లను కొనేవారు పెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ రంగానికి గిరాకీ లేకపోవడం వల్ల.. వైజాగ్ నుంచి తిరుపతి వరకూ పెట్టుబడిదారులు భాగ్యనగరానికి విచ్చేశారు. అంతకుముందు, నగరం నుంచి అక్కడికి వెళ్లిన వ్యాపారులు, ప్రవాసాంధ్రులు మళ్లీ తిరుగుపయనం అయ్యారు. కోస్తా ప్రాంతాల్నుంచి శంకర్‌పల్లి నుంచి జహీరాబాద్ వరకూ ప్లాట్లను ఎక్కువగా కొన్నారు. ఇక్కడి వైద్య సదుపాయాల్ని దృష్టిలో పెట్టుకుని, ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకమంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు నగరానికొచ్చి కొనడం మొదలెట్టారు. గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం వల్ల అధిక శాతం మంది సొంతింటిని కొన్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ప్రీ లాంచ్ సేల్స్ అని ఘంటాపథంగా చెప్పగలను. అపరిమిత ఎఫ్ఎస్ఐ కారణంగా.. ఎక్కువ బిల్టప్ ఏరియా కట్టేందుకు అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. శంషాబాద్ విమానశ్రయం విస్తరించడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అన్ని జాతీయ రహదారులకు అనుసంధానం, వచ్చే 50 ఏళ్ల దాకా తాగునీటికి ఎలాంటి కొరత ఉండకపోవడం వంటి కారణాల వల్ల హైదరాబాద్ వైపు దృష్టి సారించేవారు పెరిగారు.
యూడీఎస్‌కు వ్యతిరేకం..
యూడీఎస్, ప్రీలాంచులు పరిశ్రమకు మంచిది కాదు. కొనుగోలుదారులకు సొమ్ముకు ఎలాంటి భద్రత ఉండదు. తక్కువ వస్తుందనే ఆశతోనే ఎక్కువగా కొంటున్నారు. రాత్రికి రాత్రే సొమ్ము సంపాదించొచ్చనే దురాశ కలిగిన వారు రియల్ రంగంలోకి విచ్చేసి యూడీఎస్, ప్రీలాంచ్ సేల్స్ జరుపుతున్నారు. ఇలాంటి వారు దీర్ఘకాలంలో మార్కెట్ నిలబడరు. వీరి వల్ల మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. అందుకే, ప్రభుత్వం ఇలాంటి అక్రమ రియల్టర్లను నిరోధించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోతుంది. రెరా అథారిటీ వీరిపై చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ విభాగం, విజిలెన్స్ విభాగం ఇలాంటి మోసాలపై దృష్టి సారించాలి. యూడీఎస్ అమ్మకాల్ని రిజిస్ట్రేషన్ శాఖ నిరోధించాలి. యూడీఎస్ రియల్టర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు కాబట్టి, వీరి వద్ద ప్లాట్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉండాలి.
నిర్మాణంలో 301 లగ్జరీ విల్లాలు
ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు చేరువలో.. హాల్ మార్క్ కౌంటీ, హాల్‌మార్క్ ఇంపీరియా అనే రెండు విల్లా ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నాం. హాల్ మార్క్ లో నిర్మిస్తున్న 171 విల్లాల శ్లాబు పని పూర్తయ్యింది. ప్లాస్టిరింగ్, ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. ఇంపీరియాలో అన్నీ హైఎండ్ విల్లాలే ఉంటాయి. ఇందులోని 130 విల్లాల శ్లాబు పనులు జోరుగా జరుగుతున్నాయి. వీటిని చకచకా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేస్తామని తెలిపారు.