ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం రాజస్థాన్ సమ్మిట్-2022ని వేదికగా చేసుకోవడానికి జైపూర్ డెవలప్ మెంట్ అథార్టీ (జేడీఏ) చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రాజస్తాన్ క్రెడాయ్ తో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జైపూర్ కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రాజస్థాన్ సమ్మిట్-2022లో ఏకంగా రూ.10వేల కోట్ల మొత్తం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. మానసరోవర్ లో రెండో దశ అమ్యూజ్ మెంట్ పార్కు నిర్మాణం మొదలుపెట్టడంతోపాటు షిప్రపథ్ లోని మెడికల్ ఆస్పత్రి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. వీటితోపాటు జైపూర్ లో మూడు పారిశ్రామిక నగరాలు అభివృద్ధి కానున్నాయి. వీటిలో దాదాపు 2వేల పరిశ్రమలు రానున్నాయి. అలాగే దాదాపు 3వేల ప్లాట్లతో రెండు సమీకృత టౌన్ షిప్స్ కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్నట్టుగా కార్పొరేట్ ఆఫీసుల కోసం ఐటీ హబ్ కూడా అభివృద్ధి చేయనున్నట్టు సదరు కంపెనీ పేర్కొంది. అలాగే జగత్ పుత్ర-టాంక్ రోడ్డులో రెండు వర్కింగ్ వుమెన్స్ హాస్టళ్లతోపాటు ఢిల్లీ రోడ్డులో ప్రైవేటు గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. కాగా, రాజస్థాన్ సమ్మిట్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు రావడంతోపాటు పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోందని సమావేశం తర్వాత అధికారులు అభిప్రాయపడ్డారు.