poulomi avante poulomi avante

ప‌ర్మిష‌న్ల కోసం ”పంచాయ‌తీ”

  • కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో పెరిగిన అవినీతి జాడ్యం
  • గ‌జానికి రూ.300 చొప్పున డిమాండ్‌!
  • చ‌. అడుక్కీ రూ.100-200 ఇవ్వాల్సిందే
  • డెవ‌ల‌ప‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్న నేత‌లు
  • మ‌రీ ఇంత దారుణ‌మా? విసిగిపోతున్న‌ బిల్డ‌ర్లు
  • తెలంగాణ వ‌చ్చింది ఇందుకేనా?

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

జీహెచ్ఎంసీ ప‌రిధిలో.. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు.. ల‌గ్జ‌రీ విల్లాల నిర్మాణానికి అనుమతులు పెద్ద‌గా ఆల‌స్య‌మైన దాఖ‌లాల్లేవు. న‌యా పైసా అద‌నంగా ఖ‌ర్చు కాకుండా అనుమ‌తులు చేతికి వ‌చ్చాయ‌ని కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు గ‌ర్వంగా చెబుతారు. హెచ్ఎండీఏలో ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. అమ్యామ్యాలు అంద‌నిదే ఫైలు ముందుకు క‌ద‌ల‌దు. తాజాగా.. కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో అవినీతి బీభ‌త్సంగా పెరిగింది. తెలంగాణ ఏర్ప‌డ్డాకే ఈ స్థాయిలో పెరిగింద‌ని పలువురు డెవ‌ల‌ప‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకేనా.. తెలంగాణ వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా.. 21 రోజుల్లోనే అపార్టుమెంట్ల‌కు అనుమ‌తినిస్తామ‌ని తెలంగాణ పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు ఏ రాష్ట్రంలోనూ ఇంత త్వ‌రగా అనుమ‌తులు మంజూరు కావ‌ట్లేద‌ని అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్రతినిధుల వద్ద, వివిధ సమావేశాల్లో ఊద‌ర‌గొట్టారు. ఆయ‌న ఆలోచ‌న మంచిదే. ఇందులో ఎలాంటి త‌ప్పు లేదు. పుర‌పాల‌క శాఖ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తేవాల‌న్న‌దే ఆయ‌న దృఢ సంక‌ల్పం. కానీ, వాస్త‌వంగా జ‌రుగుతున్న‌దేమిటి? స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు డెవ‌ల‌ప‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తున్నారు. మున్సిప‌ల్ కౌన్సిలర్లు, వార్డు స‌భ్యులు, స‌ర్పంచిలు, ఉప స‌ర్పంచిలు డెవ‌ల‌ప‌ర్ల‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు. లేఅవుట్ అయితే చ‌ద‌ర‌పు గ‌జానికి ఇంత సొమ్ము క‌ట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. అపార్టుమెంట్ అయితే చ‌ద‌ర‌పు అడుక్కీ ఇంత మొత్తం చెల్లించాల్సిందేనంటూ ఫ‌త్వా జారీ చేస్తున్నారు. దీంతో, బిల్డ‌ర్లు శివార్ల‌లో ప్రాజెక్టులంటేనే హ‌డ‌లిపోతున్నారు. అయినా, కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు మొండి ధైర్యంతో అడుగు ముందుకేస్తే.. వారికి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక కొంద‌రైతే, బిల్డ‌ర్ల‌ను బ‌య‌టి దేశం నుండి వ‌చ్చిన వ్య‌క్తులుగా ప‌రిగ‌ణిస్తున్నారు. కాసులిస్తేనే క‌ట్టుకోనిస్తామంటూ దౌర్జ‌న్యం చేస్తున్నారు. సొంత రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఒక అపార్టుమెంట్ క‌ట్టాలంటే ఇంత అరాచ‌క‌మా అంటూ తెలంగాణ డెవ‌ల‌ప‌ర్లు విస్తుపోతున్నారు.

జ‌ల‌గ‌లా ప‌ట్టి పీడిస్తున్నారు!

నిర్మాణ వ్యాపారంలో ఉన్న‌ బిల్డర్లు సాధారణంగానే స్థానిక ప్రజాప్రతినిధులతో సత్సంబంధాల్ని కొనసాగిస్తారు. అయితే, కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే.. పది రెట్లు అధిక సొమ్ము కావాలంటూ కొందరు రాజకీయ నాయకులు బిల్డర్లను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. దానికి సమ్మతించకపోతే నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. వీరి ఆగ‌డాలు భ‌రించ‌లేక కొంద‌రు బిల్డ‌ర్లు అయితే రెండు, మూడు నెల‌ల పాటు ప‌నుల్ని నిలిపివేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌ట్నుంచి నిర్మాణ రంగం పురోగ‌తి చెందుతోంది. డీపీఎంఎస్‌, టీఎస్ బీపాస్‌, కొత్త మున్సిప‌ల్ చ‌ట్టం వంటిని ప్ర‌వేశ‌పెట్ట‌డం చ‌క్క‌టి ప‌రిణామం. అనుమ‌తుల కోస‌మ‌య్యే ర‌క‌రకాల ఫీజుల‌న్నీ హెచ్ఎండీఏ, డీటీసీపీ వ‌ద్ద క‌ట్టేస్తారు. స్టాంప్ డ్యూటీ చెల్లించి స్థ‌లాన్ని కూడా రిజిస్ట‌ర్ చేసుకుంటారు. కేవ‌లం ఫార్మాలిటీ కోసం స్థానిక సంస్థ వ‌ద్ద లెట‌ర్ తీసుకోవ‌డానికి వెళితే.. అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు ర‌క‌ర‌కాల‌ ఇబ్బందులు పెడుతున్నారు. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.100 నుంచి 200 చెల్లించాలంటూ తీర్మానం చేస్తున్నారు. లేఅవుట్లు అయితే గ‌జానికి రూ.100 నుంచి రూ.300 అద‌నంగా క‌ట్ట‌మంటున్నారు. ఇదెక్క‌డి న్యాయ‌మంటే కాల‌యాప‌న చేస్తున్నారు. దీంతో, బిల్డ‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

దోచుకునే సంస్కృతి విడ‌నాడాలి..

మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్లు, పంచాయ‌తీల ప్ర‌జాప్ర‌తినిధులు గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. స్థానిక సంస్థ‌కు కొన్నేళ్లుగా రాని నిధులు.. ఒక బిల్డ‌ర్ రెండు, మూడు ఎక‌రాల్లో ప్రాజెక్టు నిర్మిస్తే వ‌స్తుంది. ఇలా వంద‌లాది డెవ‌ల‌ప‌ర్లు అపార్టుమెంట్లు, ఆకాశ‌హ‌ర్మ్యాలు, విల్లా ప్రాజెక్టుల్ని నిర్మించ‌డం వ‌ల్ల.. ప్ర‌భుత్వానికి ఫీజుల రూపంలో వంద‌ల కోట్లు వ‌స్తున్నాయి. అట్టి సొమ్ముతోనే ప్ర‌భుత్వం ఆయా ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేస్తుంది. కాబ‌ట్టి, బిల్డ‌ర్లు అంటే దుర్మార్గ‌మైన భావ‌న‌ను విడ‌నాడాలి. త‌మ ప్రాంతం అభివృద్ధి గురించి వీరంతా దృష్టి పెట్టాలి త‌ప్ప‌.. అందిన‌కాడికి బిల్డ‌ర్లను దోచుకునే సంస్కృతిని విడ‌నాడాలి. వ్య‌వ‌సాయం త‌ర్వాత అధిక శాతం మందికి నిర్మాణ రంగ‌మే ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల్ని క‌ల్పిస్తోంది. కాబ‌ట్టి, ఈ రంగం మూడు పూవులు ఆరు కాయ‌లుగా విరాజిల్లితేనే స‌మాజం సంతోషంగా ఉంటుంది.

ఆలోచ‌నా దృక్ప‌థం మారాలి

త‌మ ప్రాంతం వ‌ద్దకొచ్చి వ్యాపారం చేస్తున్నారు కాబ‌ట్టి.. తామెంత చెబితే అంత ఇవ్వాల‌నే ఆలోచ‌న విధానం మారాలి. అక్క‌డి ర‌హ‌దారులు, వీధి దీపాలు, ప్ర‌భుత్వ ద‌వాఖానాలు, స్కూళ్లు వంటివి ఎలా ఏర్పాట‌య్యాయి? అక్క‌డికొచ్చే ప్ర‌భుత్వ‌ బ‌స్సులు ఎలా న‌డుస్తున్నాయి? ఆయా ప్రాంతం అభివృద్ధి చెందడం వ‌ల్ల వ‌చ్చిన వ‌చ్చిన ఆదాయంతో కాదు క‌దా! వీటి ఏర్పాటులో నిర్మాణ రంగం పాత్ర కూడా ఉన్న‌ది క‌దా! ఎక్క‌డో ఒక చోట అపార్టుమెంట్లు క‌ట్టి, అక్క‌డి డెవ‌ల‌ప‌ర్లు రాష్ట్రానికి చెల్లించే 7.5 రిజిస్ట్రేష‌న్ ఫీజులు, కేంద్రానికి క‌ట్టే ఐదు శాతం జీఎస్టీ, అనుమ‌తుల కోసం క‌ట్టే ర‌క‌ర‌కాల ఫీజుల వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానా నిండితేనే క‌దా.. ప్ర‌భుత్వం వివిధ గ్రామాల్లో మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేసేది. ఇంత కీల‌క‌మైన విషయం మ‌ర్చిపోయి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు డెవ‌ల‌ప‌ర్ల‌ను వేధించ‌డం క‌రెక్టు కాదు. ఎన్నిక‌ల కోసం యాభై ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాం.. కోటీ రూపాయ‌లు పెట్టాం.. అంటూ ఆ మొత్తాన్ని బిల్డ‌ర్ల నుంచి వ‌సూలు చేయాల‌నుకోవ‌డం మూర్ఖత్వం అవుతుంది. కాబ‌ట్టి కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, పంచాయ‌తీ ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ల్ల డెవ‌ల‌ప‌ర్ల‌కు పెరుగుతున్న వేధింపుల్ని త‌గ్గాలంటే.. ఈ అంశంపై ప్ర‌భుత్వం దృష్టి సారించాలి. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి సారించాలి. అప్పుడే, నిర్మాణ రంగం క‌ళ‌క‌ళ‌లాడుతుంది. లేక‌పోతే, తెలంగాణ వ‌చ్చినా ప‌రిస్థితి మార‌లేదనే భావ‌న మ‌న‌సులో నాటుకుపోతుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles