జమ్మూకాశ్మీర్ పేరు చెబితే చాలు.. ఉగ్రవాదులు, సైనికుల పహారా, దాడులు వంటివి గుర్తొస్తాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే.. అందమైన మంచుకొండలు, ఏపిల్ తోటలు, దాల్ సరస్సు, వేసవిలోనూ చల్లని వాతావరణం నాణేనికి మరోవైపు. పర్యాటకపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ భూతలస్వర్గంలో పలు కారణాల వల్ల రియల్ రంగం అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే, తాజాగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అక్కడ కూడా రియల్ అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు ఇన్వెస్టర్లు కాశ్మీర్ వైపు చూస్తున్నారు. గతనెల 27న జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. అక్కడ హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.18,300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 39 ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సులో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి, కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ లతోపాటు దేశవ్యాప్తంగా పలువురు రియల్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి నరెడ్కో సభ్యులు పీఎస్ రెడ్డి, ప్రేమ్ కుమార్, హరిబాబు, శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా కాశ్మీర్ లో రియల్ రంగానికి సంబంధించిన పెట్టుబడులు చర్చకు వచ్చాయి. గతంతో కాశ్మీర్ పౌరులు కానివారు అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ కేంద్రం ఈ విషయంలో సవరణ చేయడంతో భారతీయులు ఎవరైనా సరే.. కాశ్మీర్ లో వ్యవసాయేతర భూమి కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. దీంతో అక్కడ సెకండ్ హోమ్స్, సమ్మర్ హోమ్స్ కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నరెడ్కో ఆధ్వర్యంలో గతనెల 27న రియల్ ఎస్టేట్ సదస్సు జరిగింది. అంతకుముంగు సెప్టెంబర్ 25న స్థానిక రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఆర్టిటెక్టులు, ప్లానర్లతో ఓ వర్క్ షాప్ నిర్వహించింది. అప్పుడు పలు విధానాలకు రూపకల్పన చేశారు. భవనాల అనుమతులు వేగవంతంగా వచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.