హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) పరిధిలోని చెరువులు, సరస్సుల పరిరక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాటి రక్షణకు రియల్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు చేపట్టే ప్రాజెక్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న చెరువులు, సరస్సుల రక్షణ బాధ్యతను వారే చూసుకోవాలని స్పష్టంచేసింది. ఆయా వెంచర్లు, ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినప్పుడే ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటోంది. నగరంలోని చెరువులు, సరస్సులను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 3,100 చెరువులు, సరస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి పరిరక్షణలో బిల్డర్లకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే వెంచర్ల వద్ద పచ్చదనం పెంచే బాధ్యత కూడా బిల్డర్లదేనని పేర్కొన్నారు. ‘చెరువులు, సరస్సులకు సమీపంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్న బిల్డర్లు వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ అటు క్రెడాయ్ ను, ఇటు బిల్డర్లకూ సూచించారు’ అని మున్సిపల్ శాఖ స్పెషన్ సీఎస్ అర్వింద్ కుమార్ వెల్లడించారు. హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని చెరువుల పూర్తి నిల్వ సామర్థ్యం(ఎఫ్ టీఎల్) ఖరారు చేసి, ఫెన్సింగ్ వేయడం వంటి పనులు పూర్తిచేయగా.. చాలా చెరువుల ఎఫ్ టీఎల్ ను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల విభజనను దశలవారీగా చేస్తున్నారు. కాగా, చెరువుల పరిరక్షణకు సంబంధించిన కొత్త నిబంధనలు అన్ని రకాల అభివృద్ధి పనులు, లేఔట్ అనుమతులు, బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య భవనాలకు వర్తిస్తాయని హెచ్ఎండీఏ స్పష్టంచేసింది. చాలా వెంచర్ల నుంచి మురుగునీటి పారుదలను ఆయా చెరువుల్లోకి అక్రమంగా మళ్లిస్తున్నారని, దీనిని నిరోధించాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే చెరువుల చుట్టూ వాక్ వేలు ఏర్పాటు చేయడంతోపాటు పచ్చదనం పెంపొందించాలని, ఫలితంగా చెరువునీటి నాణ్యత పెరుగుతుందని తెలిపారు.