నాలుగేళ్లుగా ముందుకు కదలని ఓ ప్రాజెక్టు విషయంలో ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (యూపీ రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ చట్టం, 2016లోని సెక్షన్ 15 కింద తన అధికారాలు వినియోగించి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించింది. సంస్థాగత అవసరాల నిమిత్తం నోయిడా సెక్టార్ 62లోని దాదాపు ఐదెకరాల స్థలాన్ని 2005 డిసెంబర్ లో ప్రొప్లారిటీ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించారు. అనంతరం ఆ సంస్థ బిజ్ లైఫ్ పేరుతో అక్కడ ప్రాజెక్టు ప్రారంభించింది. కార్యాలయాలు, వాణిజ్య భవనాలతోపాటు కొన్ని సర్వీస్ అపార్ట్ మెంట్స్ నిర్మించాలని నిర్ణయించింది. అయితే, కొంత నిర్మాణపరమైన కార్యకలాపాలు జరిగిన తర్వాత ప్రాజెక్టు నాలుగేళ్లకు పైగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పలువురు కొనుగోలుదారులు యూపీ రెరాను ఆశ్రయించారు. దీంతో ఆ సైట్ పై సర్వ హక్కులను మరో సంస్థకు బదలాయించాలని యూపీ రెరా నిర్ణయించి, ఆ మేరకు చర్యలు చేపట్టింది. సైట్ బదలాయింపునకు 750 మంది కొనుగోలుదారుల్లో 519 మంది గత నవంబర్ లో అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో దాదాపు 20వేల చదరపు మీటర్ల ఆ సైట్ ను అర్బనాక్ బిల్డింగ్ టెక్నాలజీస్ కు బదిలీ చేసింది. ఈ మేరకు యూపీ రెరా కార్యదర్శి రాజేష్ కుమార్ త్యాగి ఉత్తర్వులు జారీచేశారు. ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేసి కొనుగోలుదారులకు అప్పగిస్తామని సంస్థ భాగస్వామి పరితోష్ గోయెల్ తెలిపారు. బిల్డింగ్ ప్లాన్ కోసం నోయిడా అథార్టీతో సంప్రదింపులు జరుపుతున్నామని, అది ఆమోదం పొందగానే సైట్ లో పని ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసేందుకు ఎస్ బీటీఎల్ అనే మరో నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది.