ఏదైనా ప్రాజెక్టు కట్టడం ఓ ఎత్తైతే.. వాటికి సంబంధించిన నిర్మాణ వ్యర్థాల తొలగింపు మరో ఎత్తు. భవనాల నిర్మాణాల సందర్భంగా వచ్చిన వ్యర్థాలను తీసుకెళ్లి నగరానికి దూరంగా పడేయడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారం. ఇకపై ఇలాంటి ఇబ్బందులకు చెక్ చెప్పే దిశగా ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కూల్చివేత, నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 85510 58080 నెంబర్ కు కాల్ చేస్తే.. సంబంధిత సిబ్బంది వచ్చి నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తారు. ఇందుకోసం భవనం అనుమతి తీసుకున్నప్పుడే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే రోడ్ల పక్కన, ఓపెన్ ఫ్లాట్లలో అక్రమంగా పడేసిన నిర్మాణ వ్యర్థాలను కూడా ఈ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయడం ద్వారా తొలగించుకోవచ్చు. ఇలాంటి నిర్మాణ వ్యర్థాల గురించి స్థానికులు ఫిర్యాదు చేస్తే ఈ కంట్రోల్ రూమ్ తగిన చర్యలు తీసుకుంటుంది. ‘ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఫోన్ చేసిన వెంటనే రెండు గంటల్లోపే పని పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నాం. కూల్చివేత, నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వాహనాలతోపాటు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. కంట్రోల్ రూమ్ కి వచ్చే కాల్స్ అన్నీ కూడా క్రమపద్ధతిలో పరిష్కరిస్తాం. ఈ వివరాలన్నీ నమోదు చేస్తాం’ అని ఏఎంసీ అడ్మినిస్ట్రేటర్ అస్తిక్ కుమార్ పాండే తెలిపారు. వ్యర్థాల తొలగింపునకు భారీ, మినీ వాహనాలను వినియోగించనున్నట్టు వెల్లడించారు.