ఐటీసీ వెల్‌కం హోటల్ గుంటూరు రావడం సంతోషకరంగా ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన ఐటీఎసీ వెల్‌కం హోటల్‌ని ఆరంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజివ్ పూరికి ధన్యవాదాలు తెలిపారు. ఐటీసీతో భాగస్వామ్యం మంచి అవకాశమన్నారు. గుంటూరు లాంటి పట్టణంలో ఫైవ్‌స్టార్ హోటల్ ఉండటం, అలాంటి ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఐటీసీ భాగస్వామ్యం కావడం మంచి పరిణామం అని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఐటీసీ భాగస్వామ్యంతో వ్యవసాయరంగంలో ప్రత్యేకంగా పుడ్ ప్రాసెసింగ్‌లో ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మనం ఏ గ్రామానికి వెళ్లినా మూడు రంగాల్లో సమూలమైన మార్పులు చూస్తారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో గమనించవచ్చు. వ్యవసాయరంగం తీసుకుంటే ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఉన్నాయి. దాదాపు 10,700 ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం. గ్రామస్ధాయిలో వ్యవసాయరంగంలో ఏ రకమైన మౌలిక సదుపాయలను ప్రైమరీ ప్రాససింగ్ లెవల్‌లో కల్పించాం, ఇంకేం కల్పించాలన్నది చాలా ముఖ్యమైన అంశం. పార్లమెంట్ నియోజకవర్గ స్ధాయిలో సెకండరీ ప్రాససింగ్ లెవల్‌లో ఏర్పాటు కానున్నాయి. ఈ విషయంలో ఐటీసీ ముందుకొచ్చి భాగస్వామ్యం కావడం ద్వారా కీలకమైన పాత్ర పోషించనుంది.