సిమెంట్ కంపెనీల తరహాలో స్టీలు సంస్థలన్నీ కలిసి సిండికేట్ గా ఏర్పడ్డాయా? ఇవన్నీ కలిసి స్టీలును టన్నుకు రూ.90 వేలను దాటించేస్తాయా? అసలెందుకీ సంస్థలు ఇలా ఒక్కసారిగా రేట్లను పెంచుతున్నాయా? ఇలాగే కొనసాగితే నిర్మాణ వ్యయం మరింత పెరిగి.. ఆ భారం కొనుగోలుదారుల మీద మరింతగా పడుతుందా? ఇప్పటికే అమ్మకాలు తగ్గి నిర్మాణ రంగం ఇబ్బంది పడుతోంది. ఇలా, ఒక్కో సంస్థ నిర్మాణ సామగ్రి ధరల్ని పెంచితే నిర్మాణ వ్యయం అధికమైక.. ఫ్లాటు కొనేవాళ్లు మరింత దూరం అవుతారు.
హైదరాబాద్లో నిర్మాణ రంగం ఉవ్వెత్తున ఎగుస్తుందనో మరే ఇతర కారణాలో తెలియదు కానీ, స్టీలు కంపెనీలు క్రమక్రమంగా స్టీలు ధరల్ని పెంచుతున్నాయి. రోజుకో రేటును చెబుతున్నాయి. రెండు వారాల క్రితం రీ రోలింగ్ స్టీలు, అంటే కాస్త నాణ్యమైన రకం టన్నుకు 58 నుంచి 60 వేలు ఉండేది. కానీ, అది కాస్త ప్రస్తుతం 77 నుంచి 78 వేలకు అటుఇటుగా చేరుకుంది. అంటే, గత పది రోజుల్లో దాదాపు 35 శాతం పెరిగింది. టన్నుకి 17 నుంచి 20 వేలు పెరిగితే.. రోజుకు పది టన్నుల్ని కొనాలంటే.. రూ. 1.70 నుంచి 2 లక్షలు అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఓ వంద టన్నులు కొంటే రూ.17 నుంచి 20 లక్షలు అవుతుంది. దీని వల్ల ప్రస్తుతం నిర్మాణ పనుల్ని జరుపుతున్న సంస్థల మీద భారం పడుతుంది. అంతిమంగా అది కొనుగోలుదారుల మీదికి బదిలీ అవుతుంది. నెల, నెల పదిహేను రోజుల వ్యవధిలో టన్నుస్టీలు 60 వేల నుంచి 90 వేలకు చేరుకోవడం దారుణమైన విషయం.
మరి, దీని మీద నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా కార్యచరణ రూపొందించాలి. ధరలు తగ్గించేలా ఆయా సంఘాలపై ఒత్తిడి తేవాలి. లేదా విడివిడిగా పలు స్టీలు కంపెనీలతో చర్చించి.. ఒక ధర నిర్ణయించి.. ఆ రేటుకే నిర్మాణ సంస్థలన్నీ కొనుగోలు చేసేలా నిర్ణయించాలి. ఓ వందకు పైగా నిర్మాణ సంస్థలు ఒకే దగ్గర కొనుగోలు చేయడమంటే మాటలు కాదు కదా? ఇలా, నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా ఒక మాట మీద నిలబడితేనే ఎలాంటి సిండికేటునైనా దారిలోకి తెచ్చే అవకాశం ఉంటుంది.