- రియల్ ఎస్టేట్ గురుతో ప్రముఖ నటి రాశీఖన్నా
రాశీఖన్నా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరియచం చేయక్కర్లేని పేరు. మన కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిన ఈ క్యూటీ భామ ఇప్పటికే బోలెడు సినిమాల ద్వారా తెలుగువారికి చేరువయ్యారు. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. వృత్తిరీత్యా హైదరాబాద్ లో చక్కని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ తన మనసులో మాటలను వెల్లడించే ఈ అందాల తా.. తాజాగా రియల్ ఎస్టేట్ గురుతో ముచ్చటించారు. హైదరాబాద్ లో ప్రేమతో నిండి ఉన్న తన చిన్న ఇంటి గురించి బోలెడు విషయాలు పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు చూస్తే.. రాశీఖన్నాలాగే ఆమె ఇల్లు కూడా ఎంతో ముద్దుగా, అందంగా ఉంటుందని అర్థమవుతుంది.
హస్తిన నుంచి వచ్చిన రాశీఖన్నా.. హైదరాబాద్ లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఇక్కడే నివసిస్తున్నారు. భాగ్యనగరం తనకు బాగా నచ్చిందని.. అందువల్ల శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ‘నా కలల ఇల్లు హైదరాబాద్ లోనే ఉంది. నేను దానిని నా డ్రీమ్ హౌస్ అనే పిలుస్తాను. ఎందుకంటే ఇది చాలా హోమ్లీగా, చాలా సౌకర్యవంతంగా, అంతకుమించి హాయిగా ఉంటుంది. నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఈ ఇల్లు నాకు చాలా అంటే చాలా ఇష్టం’ అని తెలిపారు. మీ ఇంటికి వస్తే మాకు కనిపించే ముఖ్యమైన ఒక వస్తువు ఏమిటని అడగ్గా.. ‘ప్రేమ’ అంటూ ఠక్కున బదులిచ్చారు. ‘అవును.. మీరు విన్నది నిజమే. మీరు మా ఇంటికి వస్తే అనిర్వచనీయమైన ప్రేమానుభూతి పొందుతారు. మిమ్మల్ని ఎవరూ చూసుకోనంత ప్రేమగా ఇక్కడ చూసుకుంటారు. రంగులు, అలంకరణల కంటే ఇదే ముఖ్యమని భావిస్తాను. ఇంటికి సంబంధించినంత వరకు ఇది చాలా ప్రాధాన్యం కలిగిన అంశం’ అని రాశీఖన్నా తన మనసులో మాట వెల్లడించారు.
సరళంగా హోమ్లీ జీవితాన్ని జీవించాలని భావించే రాశీఖన్నా ఇంకా తన ఇంటి గురించి ఇలా చెప్పారు. ‘మాది ఒక త్రిపుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్. అందులో ఓ అందమైన బాల్కనీ కూడా ఉంది. మా నాన్నకు పువ్వులంటే చాలా ఇష్టం. దీంతో బాల్కనీని రకరకాల పూలతో నింపేశారు. మా అమ్మ గృహిణి. ఆమె నా కోసం కిచెన్ లో వంట చేస్తూ ఉండటంతో నేను ఏమీ చేయకుండా ఇలా తయారయ్యా.
మొత్తానికి మాది హాయిగా ఉంటే ఇల్లు’ అని వివరించారు. ఇక టిన్సెల్ టౌన్ పార్టీల్లో చాలా అరుదుగా కనిపించే రాశి.. ఓ పుస్తకాల పురుగు అని మీకు తెలుసా? బుక్స్ పట్ల ఆమెకు ఉన్న ప్రేమ కారణంగా తన ఇంట్లో చిన్న లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ‘నాకు చదవడం అంటే చాలా ఇష్టం. డాక్టర్ బ్రియాన్ వీస్ రచించిన ‘ఓన్లీ లవ్ ఈజ్ రియల్’ నాకు అత్యంత ఇష్టమైన పుస్తకం. అందువల్లే మా ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసుకున్నాను. అక్కడ నేను, నా తల్లిదండ్రులు సరదాగా కాసేపు గడుపుతుంటాం’ అని తెలిపారు.