హైదరాబాద్లో ఆకాశహర్మ్యాలకు హెచ్ఎండీఏ ఎడాపెడా అనుమతుల్ని మంజూరు చేస్తోంది. కొందరు బిల్డర్లు అయితే అనుమతి చేతికి రాకముందే.. స్కై స్క్రేపర్లను నిర్మిస్తున్నామని చెబుతూ.. ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. అంటే, కేవలం బ్రోచర్లను చూపెట్టి ఫ్లాట్లను తక్కువ రేటంటూ విక్రయిస్తున్నారు. వాస్తవానికి చెప్పాంటే, ఇంతవరకూ హెచ్ఎండీఏ మంజూరు చేసిన నిర్మాణాల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ అంశాన్ని పక్కన పెడితే, ఆకాశహర్మ్యాల్ని నిర్మించే క్రమంలో వాటి నాణ్యతా ప్రమాణాల్ని పరిశీలించేది ఎవరు? అసలు ఏయే విభాగం హైదరాబాద్లో డెవలపర్లు కట్టే.. 30 నుంచి 50 అంతస్తుల్లో నిర్మాణాల్ని గమనిస్తుంది? ఆయా డెవలపర్లు నాణ్యంగానే కడుతున్నారనే అంశాన్ని సర్టిఫై చేసేదెవరు?
హైదరాబాద్లో నిర్మాణ రంగం గొప్పతనం ఏమిటంటే.. కాస్త స్థలముంటే చాలు.. చేతిలో డబ్బుల్లేకపోయినా కొందరు వ్యక్తులు బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. వీరి విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యం, అనుభవం గురించి పెద్దగా పట్టించుకునేవారూ లేరు. నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అర్హతలు లేకపోయినా, కొందరు బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. కాబట్టి, ఇక నుంచి అయినా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీలు వంటివి అనుమతుల్ని మంజూరు చేసేటప్పుడు ఆయా బిల్డర్లకు సంబంధించి సాంకేతిక వివరాల్ని తెలుసుకోవాలి.
నివాసాల్లో అనుభవం లేనివారూ..
హైదరాబాద్లో నివాస సముదాయాల నిర్మాణాల్లో పెద్దగా అనుభవం లేనివారూ.. కోకాపేట్లో ఆకాశహర్మ్యాల్ని కడుతున్నామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవైపు స్థలానికి సంబంధించిన సొమ్మును సమీకరించేందుకు వాట్సప్పుల్లో సమాచారం పంపిస్తూ.. ఫ్లాట్లను అమ్ముతున్నారు. మరోవైపు అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నారు. అంటే, హెచ్ఎండీఏ అధికారులు ఎలాగైనా అనుమతినిస్తారని గట్టి నమ్మకం ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు బయ్యర్లు విమర్శిస్తున్నారు.
ఆకాశహర్మ్యాల్ని కట్టేవారికి అనుమతిని మంజూరు చేసేటప్పుడు.. గతంలో ఆయా సంస్థ ఎన్ని అంతస్తుల ఎత్తు వరకూ అపార్టుమెంట్లను నిర్మించిందనే అంశాన్ని గమనించి.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతినివ్వాలని వీరంతా కోరుతున్నారు. లేకపోతే, ఆయా బిల్డర్లు ఆకాశహర్మ్యాల్ని నాణ్యంగా కట్టకున్నా.. నిర్మించకుండా చేతులెత్తేసినా.. ప్రజలందరూ ప్రభుత్వాన్ని నిందించే అవకాశముంది. కాబట్టి, ఈ అంశంలో స్థానిక సంస్థలు కచ్చితంగా వ్యవహరించాలి.