- ట్రెడా సెక్రటరీ జనరల్ మేకా విజయ్‌సాయి
- ఫ్లాట్ల ధరలు తగ్గడమంటూ ఉండవు
- పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలి
- ఇందుకు సంబంధించి ట్రెడా సహకరిస్తుంది
- మామిడిపల్లిలో కొత్త ప్రాజెక్టు ఆరంభిస్తున్నాం
కింగ్ జాన్సన్ కొయ్యడ: ‘‘ 111 జీవో ఎత్తివేత వల్ల కోకాపేట్, నార్సింగి వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు తగ్గే ప్రసక్తే లేదని ట్రెడా సెక్రటరీ జనరల్ మేకా విజయ్ సాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. పూర్తి స్థాయి స్పష్టత వచ్చేందుకు కనీసం ఒకట్రెండేళ్లయినా పడుతుందని అంచనా వేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడైనా లొకేషన్ కు ప్రాధాన్యత ఉంటుందని.. దాన్ని బట్టి ప్రాజెక్టుల అమ్మకాలు జరుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ప్రస్తుతం కోకాపేట్ లో నివాస సముదాయాలతో పాటు ఐటీ నిర్మాణాలు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయని.. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాలన్నీ హాట్ లొకేషన్లుగా మారతాయని తెలిపారు. పైగా, ప్రస్తుతం భూములూ పెద్దగా అందుబాటులో లేవనే విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో మేకా విజయ్ సాయి మాటల్లోనే..
ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి.. ఆయా ప్రాంతాల్ని ఎలా వినియోగంలోకి తేవాలనే అంశంపై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేకంగా కమిటీని నియమించింది. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలి? ఏయే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతిని మంజూరు చేయాలి? ఎంతెంత స్థలాన్ని ఎప్పుడెప్పుడు అభివృద్దిలోకి తేవాలి? వంటి అంశాలకు సంబంధించి ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేస్తుంది. ఈ క్రతవులో ప్రభుత్వం ట్రెడా వంటి నిర్మాణ సంఘాల్ని భాగస్వామ్యుల్ని చేస్తే.. తమ అనుభవాన్ని ఉపయోగించి.. ఈ ప్రాంతం అభివృద్ధి పర్చడంలో కీలకమైన తోడ్పాటును అందిస్తాం. ఈ ప్రాంతమంతా హరితమయం చేయాలి కాబట్టి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వంటి సంస్థ అనుభవాన్ని ఇందుకోసం వినియోగించాలి. ప్రధానంగా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి.. పర్యావరణానికి ఎలాంటి దెబ్బ రాకుండా చర్యలు తీసుకోవాలి.
ఇలా చేస్తే గృహాలు అందుబాటులోకి..
హైదరాబాద్‌లో భూముల ధరలు అనూహ్యంగా పెరగడం.. నిర్మాణ సామగ్రితో పాటు కార్మికుల వ్యయం రెట్టింపు కావడం వల్లే ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయి. పెరిగిన రేట్లకు అందుబాటు ధరలో ఫ్లాట్లను నిర్మించలేని దుస్థితి ఏర్పడింది. ముంబైలో ఫ్లాట్ కొనుగోలుదారులకు 800 చదరపు అడుగుల ఫ్లాట్ లగ్జరీగా భావిస్తారు. కానీ, మన వద్ద వాస్తుతో కూడిన బడా ఫ్లాట్లు ఉంటేనే కొనుగోలు చేయడానికి ముందుకొస్తారు. ప్రస్తుతమున్న భూముల ధరలకు అటు శంకర్ పల్లిలో కానీ ఇటు రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో కానీ అందుబాటు ధరలో ఫ్లాట్లను నిర్మిస్తే.. అక్కడ నివసించేందుకు ఎంతమంది ముందుకొస్తారు చెప్పండి? కాబట్టి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో భూముల్ని ప్రైవేటు డెవలపర్లకు అందజేసి ఫ్లాట్లను కట్టమంటే ఎంచక్కా కట్టేస్తాం. అంతేతప్ప, పెరిగిన భూముల ధరలకు నగరంలో అందుబాటు ధరలో ఫ్లాట్లను నిర్మించడం కష్టమే.
మా సభ్యులకు..
ట్రెడా తరఫున మా సభ్యులకు మార్కెట్ స్థితిగతుల్ని పక్కాగా తెలియజేస్తాం. మార్కెట్లో ఏయే ప్రాంతాల్లో నిర్మాణాలు నిర్మిస్తున్నారనే వివరాల్ని అందజేస్తాం. మొత్తానికి, సభ్యులకు రియల్ రంగానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తాం. నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. తెలంగాణ నిర్మాణ రంగం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహాయ సహకారాల్ని అందజేస్తాం. ఎప్పటిలాగే ఈ అక్టోబరులో ట్రెడా ప్రాపర్టీ షోను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం.