ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు రూ.13,105 కోట్లు వెచ్చించనుంది. గతేడాది ఇందుకోసం రూ.3,600 కోట్లు ఖర్చు చేయగా.. ఈసారి ఈ మొత్తాన్ని పెంచినట్టు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో ఈ అంశంపై సమీక్ష జరిపిన ఆయన.. హౌసింగ్ పథకం ఎప్పుడు ప్రారంభమైనా నిర్మాణ సామగ్రితో రెడీగా ఉండాలని సూచించారు. అలాగే లేఔట్లలో స్టోరేజ్ పాయింట్లను నిర్మించాలని ఆదేశించారు. కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన లేఔట్లకు బదులు ప్రత్యామ్నాయం చూడాలని పేర్కొన్నారు. కాగా, కోర్టు వివాదాలు తొలగిపోవడంతో ఏప్రిల్ 28న 1.43 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే జూన్ నాటికి ఇళ్ల నిర్మాణ పనులు మొదలవుతాయని వివరించారు. మొత్తం 63 లేఔట్లలో ఇళ్ల నిర్మాణం కోసం సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అంతే కాకుండా 5 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోట సామగ్రి భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్లను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 66 గోడౌన్లకు 47 గోదాముల నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు.