రాష్ట్రంలో అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీలు(యూడీఏ), అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్ బీ)కి సంబంధించి 80 మాస్టర్ ప్లాన్ల తయారీకి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం టైర్-2 నగరాలతోపాటు హెచ్ఎండీఏని ఆనుకుని ఉండి, లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వాటిని అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. ఇందులో భాగంగానే 80 మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది.
ఈ కొత్త మాస్టర్ ప్లాన్లలో ఔటర్ రింగు రోడ్లతోపాటు బహుల భూముల వినియోగం, లింక్ రోడ్ల వంటివి ఉంటాయి. ప్రభుత్వం కొత్తగా 70 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన తరుణంలో మాస్టర్ ప్లాన్ల అవసరం ఉందని అధికారులు తెలిపారు.
కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, పెద్దపల్లి మాస్టర్ ప్లాన్లు 20 ఏళ్ల కింద రూపొందించినవని.. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు కాకుండా నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథార్టీ, యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథార్టీ వంటి యూడీఏలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో వీటికి మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఇప్పటికే 30 నుంచి 35 ప్లాన్లు రెడీ కాగా, ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నారు.