- ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో
ప్లాట్లు అమ్మేసుకుంటున్న లబ్ధిదారులు - స్టాంపు పేపర్లపై ఒప్పందాలతో అమ్మకాలు
విజయవాడ జగనన్న కాలనీల్లో పేదలకు కేటాయించిన ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాంటి వ్యవహారాలపై దృష్టి సారించారు. వాస్తవానికి ఆయా కాలనీల్లో పేదలకు కేటాయించిన ప్లాట్లను అమ్మడానికి వీల్లేదు. అయినప్పటికీ దాదాపు 190 మంది లబ్ధిదారులు తమ ప్లాట్లను స్టాంపు పేపర్లపై ఒప్పందం చేసుకుని విక్రయించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది.
నున్న హౌసింగ్ లేఔట్ లో ప్రభుత్వం 7500 ఇళ్లు మంజూరు చేసింది. అందులో 3వేల ఇళ్ల నిర్మాణ సాగుతోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పలువురు లబ్ధిదారులు తమకు వచ్చిన ప్లాట్లను విక్రయిస్తున్నారు. దళారులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాలు సాగిస్తున్నారు. సెంటును రూ.1.2 లక్షలకు అమ్మేలా ఒప్పందాలు కుదురుస్తున్నారు.
నిజానికి ఈ కొనుగోలు లావాదేవీలు చెల్లవు. అయినప్పటికీ స్టాంపు పేపర్లపై రాయించుకుని ఈ తతంగం ముగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు రంగంలోకి దిగారు. ఎవరెవరు ప్లాట్లు విక్రయించారో తెలుసుకునే పని మొదలుపెట్టారు. ఈ కాలనీల్లో ప్లాట్లు కొనుగోలు చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని, ఎవరైనా అలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.