- ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.205 కోట్ల నికర లాభం
ప్రముఖ రియల్టీ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ లాభాల జోరు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆ సంస్థ నికర లాభాలు గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా నాలుగు రెట్ల మేర పెరిగి రూ.204.9 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ.45.8 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,011.8 కోట్లు కాగా.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ.1,418 కోట్లుగా నమోదైంది.
‘ప్రెస్టీజ్ గ్రూప్ ఈ త్రైమాసికంలో మొత్తం 2,564 యూనిట్లు విక్రయించింది. అంటే రోజుకు 28 యూనిట్లు అమ్ముడయ్యాయి’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక కంపెనీ నికర అప్పులు రూ.3,919 కోట్లు అని పేర్కొంది. ఈ త్రైమాసికంలో నాలుగు కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసినట్టు వెల్లడించింది. ‘మొత్తానికి మేం గొప్ప స్థితిలో ఉన్నాం. రాబోయే త్రైమాసికాల్లో వివిధ భౌగోళిక ప్రాంతాలు, సెగ్మెంట్లలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే దిశగా ముందుకెళ్తున్నాం. ఇది మా అమ్మకాలను, సంస్థ పురోభివృద్ధిని మరింతగా పెంచుతుంది’ అని ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు