గత 30 ఏళ్లుగా నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి అమ్మకంపై నేను పన్ను ఎలా ఆదా చేయగలను? అలాగే ఇంటి కొనుగోలు ద్వారా నేను ప్రయోజనం పొందగలనా? – రాజేశ్వరరావు, మహబూబ్ నగర్
ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమి ఈ కింద పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉంటే తప్ప, అది మూలధన ఆస్తిగా పరిగణింపబడదు:
ఎ) 10 వేల కంటే తక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీ లేదా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఏదైనా ప్రాంతంలో ఉన్న భూమి, లేదా
బి) ఏదైనా మున్సిపాలిటీ లేదా కంటోన్మెంట్ బోర్డు (10వేల నుంచి 10 లక్షల జనాభా) స్థానిక పరిమితుల నుంచి నిర్దేశిత దూరం (2 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు)లో ఉన్న భూమి.
వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనందున మీ భూమికి మూలధన ఆస్తిగా అర్హత ఉందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ వ్యవసాయ భూమి పైన పేర్కొన్న షరతులకు అనుగుణంగా లేకుంటే దానిని మూలధన ఆస్తిగా పరిగణించరు. అలాగే దాని అమ్మకం ద్వారా వచ్చే లాభాలు పన్నుకు లోబడి ఉండవు. వ్యవసాయ భూమి మూలధన ఆస్తిగా అర్హత పొందినట్టయితే, అది దీర్షకాలిక మూలధన ఆస్తి(ఎల్టీసీఏ)గా పరిగణింపబడుతుంది. హోల్డింగ్ సమయం 24 నెలల కంటే ఎక్కువగా ఉన్నందున అలాంటి వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ)కి లోబడి ఉంటుంది. అనంతరం ఎల్టీసీజీ నుంచి కింది తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు:
సెక్షన్ 54బి
వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్న భూమిని బదిలీ చేసినప్పుడు ఎల్టీసీజీ ఉత్పన్నమైతే, ఆ అమ్మకం తేదీ నుంచి రెండేళ్ల లోపు వ్యవసాయ అవసరాల కోసం ఏదైనా ఇతర భూమిని కొనుగోలు చేసినట్టయితే, ఆ మేరకు ఎల్టీజీసీలో దామాషా ప్రకారం తగ్గింపు వర్తిస్తుంది. ఒకవేళ సెక్షన్ 139 కింద రిటర్న్ దాఖలు చేసే తేదీ వరకు కొత్త భూమిని కొనుగోలు చేయడానికి ఎల్టీసీజీని పెట్టుబడి పెట్టకపోతే, అలాంటి మొత్తాన్ని పన్ను రిటర్న్ దాఖలు చేసే గడువు తేదీకి ముందే అధీకృత బ్యాంకుల్లో కేపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ (సీజీఏఎస్) లో నిర్దిష్ట మూలధనంగా డిపాజిట్ చేసి నిర్దేశిత తగ్గింపు పొందవచ్చు.
సెక్షన్ 54ఈసీ
ఎల్టీసీజీని ఎల్టీసీఏగా బదిలీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోపు నోటిఫైడ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టుబడి పెట్టిన మొత్తంలో ఎల్టీసీఏని విక్రయించిన లేదా తదుపరి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.50 లక్షల వరకు మినహాయింపునకు అర్హత పొందవచ్చు.
సెక్షన్ 54ఎఫ్
వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా వచ్చిన నికర ఆదాయంతో నిర్దిష్ట కాలపరిమిలోపు మరొక ఆస్తిని కొనుగోలు చేయడం లేదా ఇంటిని నిర్మించుకుంటే, ఎల్టీసీఏ అమ్మకం నాటికి కొత్తగా కడుతున్న లేదా నిర్మిస్తున్న ఇంటికి అదనంగా ఒక ఇల్లు మాత్రమే కలిగి ఉన్నప్పుడు, సదరు నికర ఆదాయం మొత్తం కాకుండా కొంత భాగాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టినపుడు ఎల్టీసీజీకి దామాషా ప్రకారం మాత్రమే 54ఎఫ్ మినహాయింపు వర్తిస్తుంది. ఒకవేళ నికర అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రిటర్న్ దాఖలు చేసే తేదీ వరకు కొత్త ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టకపోతే అలాంటి మొత్తాన్ని అధీకృత బ్యాంకుల్లో పేర్కొన్న సీజీఏఎస్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసి, నిర్దేశిత పద్ధతిలో ఉపయోగించుకుని మినహాయింపు పొందవచ్చు.