- ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు విన్నపం
- ప్రతిరోజూ నరకయాతన అంటున్న స్థానికులు
- మౌలిక సదుపాయల్ని పట్టించుకోకుండా
ఆకాశహర్మ్యాలకు అనుమతి - సరిపోని డ్రైనేజీ వ్యవస్థ..
- వరద నీటి కాల్వలు అభివృద్ధి చేయాలి
- తొలుత రహదారిని వెడల్పు చేయండి
- స్కూలు విద్యార్థులకు నిత్య నరకం
మియాపూర్ నుంచి బాచుపల్లి దాకా ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ చిన్నారులు స్కూలు బస్సుల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారని విచారిస్తున్నారు. అర కిలోమీటర్ వెళ్లడానికి అరగంట కంటే ఎక్కువే పడుతోందని.. ముఖ్యంగా క్యాండియర్ 40 నుంచి మియాపూర్ చౌరస్తా వెళ్లేందుకు కొన్నిసార్లు గంటకు పైగానే అవుతుందని చెబుతున్నారు.
మియాపూర్ నుంచి బాచుపల్లి రహదారిలోకి ప్రవేశించి కొద్ది దూరం వెళ్లగానే ఎడమవైపు ఆర్వీ సాయివనమాలి.. కుడివైపు వర్టెక్స్ విరాట్.. మొత్తం ఇరుకిరుగ్గా ఉంటుంది. వాహనాల్ని అక్కడే టర్న్ తీసుకోవాలి. దీంతో ఈ వాహనాలతో పాటు నేరుగా వెళ్లే వాహనాలకు ఇబ్బంది అవుతోంది. సందిట్లో సడేమియాలా నరేన్ ప్రైమార్క్ తో బాటు మరో నిర్మాణ సంస్థకు చెందిన టిప్పర్లు ప్రతిరోజు సమయపాలన లేకుండా తిరుగుతూ ట్రాఫిక్ సమస్యని జటిలం చేస్తున్నాయి. పైగా, ఈ రహదారి ప్రస్తుతం ఎనభై అడుగులే ఉండటంతో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ముఖ్యంగా, మియాపూర్ వైపు వెళ్లేటప్పుడు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అదేవిధంగా, శ్రీవెన్ మాల్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లు అలంకారప్రాయంగా మారాయి. వీటి వల్ల వాహనదారులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
కేటీఆర్.. మీరే రక్షించాలి!
మియాపూర్ నుండి బాచుపల్లి మధ్య ఫ్లైఓవర్ కచ్చితంగా వేయాల్సిందే. అప్పుడే, ఈ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. వారాంతాల్లో ఈ రోడ్డులో వెళ్లడం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడే ఇంత ఇబ్బంది ఉంటే, ఒక్కసారి కొత్త ఆకాశహర్మ్యాలు ఆరంభమైతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కాబట్టి, మంత్రి కేటీఆర్ మీరే మమ్మల్ని రక్షించాలి.- సునీల్, రెసిడెంట్, శ్రీలా గార్డెన్స్
చిన్నారులకూ కష్టం
మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ కావడంతో దాదాపు యాభైకి పైగా స్కూళ్ల బస్సులు తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మియాపూర్ నుంచి బాచుపల్లి రహదారి మీదుగా వెళతాయి. దీంతో, స్కూలుకు వెళ్లే చిన్నారులు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. కిలోమీటర్ దూరం వెళ్లడానికి కొన్ని సార్లు అర గంట కంటే ఎక్కువే పడుతుంది. మియాపూర్ – బాచుపల్లి దాకా ఆకాశవంతెన చేస్తే ట్రాఫిక్ సమస్య తగ్గతుంది.- సురేష్, మియాపూర్.
ఫ్లైఓవర్ వేయాలి
ట్రాఫిక్ సమస్య తగ్గాలంటే మియాపూర్ నుంచి బాచుపల్లి దాకా ఫ్లైఓవర్ వేయడమే సరైన నిర్ణయం. ఇప్పుడే ఈ రోడ్డు మీదుగా ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో అయితే మరింత దారుణంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నివాస సముదాయాల్ని దృష్టిలో పెట్టుకుని.. మియాపూర్ నుంచి బాచుపల్లి దాకా ఫ్లైఓవర్ వేయాల్సిందే. కాబట్టి, దీనికి పచ్చజెండా ఊపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.- డా. ఎన్ రాజశేఖర్, మియాపూర్