- 9.5 శాతం దాటితే
కొనేవారు తగ్గే అవకాశం
దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇదే సమయంలో గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5 శాతం పడితే ఇళ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని సీఐఐ అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే పేర్కొంది. జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వడ్డీ రేటు 9.5 శాతం మార్కు దాటితే తమపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏకంగా 93 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు.
గృహ రుణాలపై తక్కువ వడ్డీ ఉండటం దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు పెరగడానికి ఓ ముఖ్య కారణం. ఇటీవల వరకు ఇది కనిష్టంగా 6.5 శాతం ఉండగా.. ప్రస్తుతం 8 శాతానికి పెరిగింది. కొన్ని బ్యాంకుల్లో 8.5 శాతం వరకు ఉంది. 8.5 శాతంలోపు వడ్డీ రేటు ఉంటే పర్వాలేదని, కానీ 9.5 శాతం దాటితే మాత్రం ఇళ్ల కొనుగోలుపై తాము పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే 8.5 శాతం నుంచి 9 శాతం మధ్య ఉంటే 47 శాతం మంది కొద్దిగా ప్రభావితమవుతామని పేర్కొన్నారు. కాగా, రెసిడెన్షియల్ మార్కెట్ లో ప్రస్తుతం తుది వినియోగదారుల ఆధిపత్యమే కొనసాగుతోందని సర్వే వెల్లడించింది.
69 శాతం మంది సొంత వినియోగం కోసం.. 31 శాతం మంది పెట్టుబడుల కోసం ఇళ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నట్టు తేలింది. అలాగే మొదటిసారిగా 2 బీహెచ్ కే ఇళ్ల కంటే 3 బీహెచ్ కే ఇళ్లకు డిమాండ్ పెరిగింది. 44 శాతం మంది 3 బీహెచ్ కే వైపు మొగ్గు చూపగా.. 38 శాతం మంది 2 బీహెచ్ కేలకు ఓటేశారు. గతేడాది సర్వేలో 46 శాతం మంది 2 బీహెచ్ కేలను ఇష్టపడగా.. 40 శాతం మంది 3 బీహెచ్ కే వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం 4 బీహెచ్ కే వాటా కూడా పెరిగింది. కరోనా ముందు సర్వేలో ఇది రెండు శాతం ఉండగా.. ప్రస్తుతం 7 శాతానికి చేరింది.