మియాపూర్ నుంచి కోకా కోలా జంక్షన్ దాకా.. ప్రతిరోజు ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని.. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటే.. హెచ్ఎండీఏ మాత్రం ఎంచక్కా.. కోకాకోలా నుంచి బాచుపల్లి దాకా ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మించొద్దని ఎవరూ అనడం లేదు కానీ.. మియాపూర్ నుంచి కోకా కోలా జంక్షన్ దాకా కూడా దృష్టి సారించాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు.. హెచ్ఆర్‌డీసీ ఏదో తూతూమంత్రంగా మియాపూర్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దాకా రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టింది. ఆ తర్వాత చేతుల్ని దులిపేసుకుంది. ఆతర్వాత ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడేమో బాచుపల్లి వద్ద హెచ్ఎండీఏ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో కోకాకోలా జంక్షన్ నుంచి గండిమైసమ్మ వరకూ గల రహదారిని వెడల్పు చేసేందుకు హెచ్ఎండీఏకు ఆర్అండ్‌బీ అప్పగించింది. అయితే, ప్రతిరోజు ట్రాఫిక్ నరకానికి కారణమైన మియాపూర్ నుంచి కోకాకోలా జంక్షన్‌ను మాత్రం పట్టించుకోవట్లేదు. మరి, ఇక్కడ ఫ్లైఓవర్ వేసేదెవరు? ఇందుకోసం రోడ్డును వెడల్పు చేసేదెవరు? ఇప్పటికైనా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ అంశంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న ప్రజలతో పాటు చిన్నారుల్ని రక్షించాలని అభ్యర్థిస్తున్నారు.