భవన నిర్మాణ అనుమతుల్లో నూతన ఒరవడి సృష్టించిన టీఎస్ బీపాస్ చట్టం వచ్చి రెండేళ్లు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 2020 నవంబర్ 16న ఈ చట్టం అమల్లోకి రాగా, హైదరాబాద్ లో మూడు నెలలు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేది. కానీ టీఎస్ బీపాస్ వచ్చిన తర్వాత చాలా సులభమైపోయింది. వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకుని తగిన పత్రాలు సమర్పిస్తే చాలు.. నిమిషాల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయి. ఇప్పటివరకు ఈ చట్టం కింద దాదాపు లక్షన్నర అనుమతులు మంజూరు కాగా, అందులో అత్యధికంగా ఒక్క జీహెచ్ఎంసీవే 34వేలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో హెచ్ఎండీఏ, గ్రేటర్ వరంగల్, కరీంనగర్, ఇతర పురపాలికలు చోటు దక్కించుకున్నాయి.
దరఖాస్తు సమర్పించిన తర్వాత వాటి ఆమోదంలో నిర్లక్ష్యం చేస్తే అధికారుల జీతంలో కోత విధించడం, సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. 75 గజాలలోపు ప్లాట్ లో గ్రౌండ్ లేదా గ్రౌండ్ ప్లస్ వన్ ఇంటి నిర్మాణానికి అనుమతి, ఆక్యుపెన్సీ అవసరం లేదు. రూపాయి చెల్లించి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. 600 గజాల వరకు ప్లాట్ సైజులో పది మీటర్ల ఎత్తు వరకు నిర్మించే ఇళ్లకు ఆన్ లైన్ లో స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి మంజూరు చేస్తారు. 600 గజాల కంటే ఎక్కువ, 10 మీటర్లు మించి ఎత్తులో నిర్మించే రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాలకు ఆన్ లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ తోపాటు సింగిల్ విండో ద్వారా ఎన్వోసీ పొంది అనుమతి తీసుకోవచ్చు.