ఐటీ పరిశ్రమ మెరుగైన పనితీరును కనబరిస్తే.. ముందుగా సంతోషించేది ఎవరో తెలుసా? రియల్ రంగమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే, మన వద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అయినా, లగ్జరీ ఫ్లాట్లైనా.. ఖరీదైన విల్లాలైనా.. కొనుగోలు చేసేది ఎక్కువ శాతం ఐటీ నిపుణులే. వీరు హైదరాబాద్లో పని చేస్తున్నా.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా.. భాగ్యనగరంలోనే అధిక శాతం పెట్టుబడి పెడుతుంటారు. అందుకే, అధిక శాతం మంది రియల్టర్లు, డెవలపర్లు ఐటీ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వికసించాలని కోరుకుంటారు. అత్యంత ఇష్టపడే ఐటీ గమ్యంగా గత ఏడేళ్ల నుంచి హైదరాబాద్ అవతరించింది. మరి, 2020-21లో మన ఐటీ రంగం పని తీరు ఎలాగుందో చూసేద్దామా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి: ఐటీ ఎగుమతులు రూ.57,000 కోట్లు నేడేమో.. రూ.1,45,522 కోట్లు అంటే, దాదాపు 12.98% వృద్ధి
ఐటీ ఉద్యోగులు: 2014లో 3.23 లక్షలు, 2021లో 6,28,615.. ఏడేళ్లలో కొత్తగా 3 లక్షల ఉద్యోగాలు 20-21లో 46,489 కొత్త ఉద్యోగాలు
టీఎస్-ఐపాస్ మొత్తం ఆకర్షించిన పెట్టుబడులు: 2,14,951 కోట్లు, కొత్త ఉద్యోగాలు: 15.6 లక్షలు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సాయంతో 20.9% పెరిగింది
2020-21లో రాష్ట్ర తలసరి ఆదాయం.. రూ. 2,27,145, జాతీయ సగటు: రూ.1,27,768
2020-21లో.. టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన కొత్త పారిశ్రామిక పార్కులు: 10,
453 పరిశ్రమలకు 810 ఎకరాల భూమి కేటాయింపు, పెట్టుబడి అంచనా రూ.6,023 కోట్లు
ఉద్యోగాల అంచనా: 7,623
హైదరాబాద్ ర్యాంకులు..
1 : ఎఫ్డీఐ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ది ఫ్యూచర్ 2020-2021 ఎడిషన్లో మన ర్యాంకు
3 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశవ్యాప్తంగా తెలంగాణ (2019) ర్యాంకు
4 : నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన స్థానం
41 : హైదరాబాద్ వేర్ హౌసింగ్ డిమాండ్ పెరుగుదల
3 : 2021 ఐటీపీఓ సదస్సులో స్మార్ట్ సిటీ అవార్డులు
కొత్త పెట్టుబడులు
- ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, చందన్ వేలీలో అమెజాన్ మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. పెట్టుబడి విలువ.. రూ.20,761 కోట్లు
- నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటు. పెట్టుబడి రూ.500 కోట్లు
- సేల్స్ ఫోర్స్ పెట్టుబడి రూ.1,119 కోట్లు. ఐదేళ్లలో 2500 కొత్త ఉద్యోగాలు
- హైదరాబాద్లోకి గోల్డ్ మాన్ సాక్స్ ప్రవేశం. 500 మందికి ఉద్యోగం.
- యూస్ కు చెందిన మాస్ మ్యూచువల్ రూ.1000 కోట్ల పెట్టుబడి. జీసీసీ ఆరంభం
- ఫియట్ రూ.1100 కోట్ల పెట్టుబడి. మొదటి ఏడాది వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు
- ఒప్పో నానక్ రాంగూడలో 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు
ఇతర సంస్థలు ఇవే..
- ఫార్మా సంస్థ లక్సాయ్ రూ.400 కోట్ల పెట్టుబడి- మరింత విస్తరణ
- హెచ్ఎస్ఐఎల్ రూ.320 కోట్ల పెట్టుబడి. భువనగిరి, సంగారెడ్డిలో పైపులు, ఫిట్టింగ్ యూనిట్లు
- గ్రాన్యుల్స్ ఇండియా 400 కోట్ల పెట్టుబడి. 1600 మందికి ఉద్యోగం. లారస్ ల్యాబ్స్ రూ.300 కోట్లు.
- ఎస్టర్ ఫిల్మ్ టెక్ రూ.1,350 కోట్ల పెట్టుబడి. 800 మందికి నేరుగా ఉద్యోగం.
- తెలంగాణలో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న మేధా సర్వో డ్రైవ్స్. రూ.1000 కోట్ల పెట్టుబడి. 2200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
హైదరాబాద్లో గ్లోబల్ కంపెనీలివే..
తెలంగాణ రాష్ట్రం అవతరించాక దేశ, విదేశీ సంస్థల్ని విశేషంగా ఆకర్షించింది. ఇందులో ప్రపంచంలోనే పేరెన్నిక గల కంపెనీలున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషి వల్ల ఇది సాధ్యమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, 2015 నుంచి మన హైదరాబాద్లోకి ఏయే సంస్థలు అడుగుపెట్టాయంటే..
సంస్థ | ఎప్పుడు? | ఎక్కడ? |
---|---|---|
గూగుల్ | 12.05.2015 | నానక్ రాంగూడలో అతిపెద్ద క్యాంపస్ |
యాపిల్ | 19.05.2016 | ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో బడా టెక్ డెవలప్మెంట్ సెంటర్ |
అమెజాన్ | 30.03.2016 07.09.2017 06.11.2020 |
ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో 3 మిలియన్ చ.అ. క్యాంపస్ రూ. 1.3 మిలియన్ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ రూ.20,761 కోట్ల పెట్టుబడితో మూడు డేటా సెంటర్లు |
సేల్స్ ఫోర్స్ | 24.01.2017 | శాన్ ఫ్రాన్సిస్కో 2000 మందితో అతిపెద్ద కేంద్రం |
ఊబర్ | 25.02.2016 | ప్రపంచంలో ఐదో ఎక్సలెన్సీ కేంద్రం ఆరంభం. ఆసియాలో ప్రప్రథమం. |
మైక్రాన్ | 04.10.2019 | డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు. 2500 మందికి ఉద్యోగం. |
స్టేట్ స్ట్రీట్ | 21.11.2017 | గ్లోబల్ సెంటర్ ఏర్పాటు. 3000 మందికి ఉద్యోగం |
డీబీఎస్ | 16.05.2016 | టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు. 3000 మంది ఉద్యోగం. |
ఫియట్ క్రైస్లర్ | 16.12.2020 | రూ.1100 కోట్ల పెట్టుబడి. మొదట ఏడాదిలో 1000 మందికి ఉద్యోగం. |
ఇంటెల్ | 02.12.2019 | ప్రప్రథమంగా ఏర్పాటైన కొత్త డిజైన్ ఇంజినీరింగ్ సెంటర్. |
ప్రావిడెన్స్ | 27.02.2020 100 | మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి. 4 ఏళ్లలో 2వేల మందికి ఉద్యోగాలు |
జెడ్ఎఫ్ | 08.09.2016 | ప్రప్రథమ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు |
యూబీఎస్ | 09.12.2020 | ఆఫీసు ఏర్పాటు |
ఎంఫసిస్ | 27.09.2019 | సెంటర్ ఏర్పాటు |
పెప్సీకో | 13.09.2019 | అతిపెద్ద బిజినెస్ కేంద్రం ఏర్పాటు. 2500 మందికి ఉద్యోగాలు |
లెగటో/యాంథెమ్ | 27.09.2018 | ఫెసిలిటీ కేంద్రం ఏర్పాటు. 2000 మందికి కొత్త ఉద్యోగాలు |
పైన పేర్కొన్న సంస్థలే కాకుండా పలు సంస్థలు తమ కార్యలాపాల్ని పెంచాయి. వాటిలో ఫేస్ బుక్, క్వాల్ కమ్, యాక్సెంచర్, వెల్స్ ఫార్గో, జిలింక్స్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇందుకు చక్కటి ఉదాహరణ. ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇరవై మన వద్ద కొలువుదీరాయి.
ఇంకా ఈ కంపెనీలూ..
- గతేడాది నుంచి రూ.4000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. వీటి ద్వారా 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
- చందన్ వేలిలో ఎలక్ట్రిక్ వెహికిల్ క్లస్టర్ ఏర్పాటు.
- దివిటిపల్లి.. న్యూ ఎనర్జీ పార్కుగా ప్రకటన.
- ప్రపంచం వ్యాక్సీన్ రాజధానిగా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచంలోని ఐదు వ్యాక్సీన్లలో నాలుగు జినోమ్ వ్యాలీలో తయారు.
- రూ.1200 కోట్లతో మెడ్ ట్రానిక్ ఆర్ అండ్ డీ సెంటర్.
- సాయి లైఫ్ సైన్సెస్ కొత్త సెంటర్.. 83 వేల చదరపు అడుగుల్లో.
- వెల్ స్పన్ రూ.415 కోట్ల పెట్టుబడి.
40-50 వేల ఇళ్ల అమ్మకం?
గత మూడేళ్లలో తెలంగాణలో కేవలం ఐటీ రంగం ద్వారా కొత్తగా 1,53,407 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించాయి. ఇందులో కనీసం ముప్పయ్ నుంచి నలభై శాతం మందిని పరిగణనలోకి తీసుకున్నా.. సుమారు అరవై వేల మంది ఐటీ నిపుణులు ఫ్లాట్లు లేదా వ్యక్తిగత ఇళ్లను కొనుగోలు చేసే అవకాశముంది. వీరు కాకుండా ప్రభుత్వ సంస్థ, ప్రైవేటు, కార్పొరేట్, ఫార్మా, విద్య, వైద్య, ఆతిథ్య, డిఫెన్సు వంటి రంగాలకు చెందిన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు తదితరులు సొంతిల్లు కొనుక్కోవడానికి మొగ్గు చూపుతారు. మొత్తానికి, ఎలా చూసినా, ఏడాదికి 40 నుంచి 50 వేల ఇళ్లయినా హైదరాబాద్లో అమ్ముడవుతాయని అంచనా.
ఐటీ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాభమేంటి?
మనకు మంచి పరిణామం
కొత్తగా 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే రియల్ రంగానికి మంచి పరిణామం. ఇందులో కనీసం ముప్పయ్ శాతం మంది ఎప్పుడో ఒకప్పుడు సొంతిల్లు కొనుగోలు చేసేవారే. మళ్లీ ఇందులో యాభై శాతం అందుబాటు గృహాల వైపు మొగ్గు చూపుతారు. 30 నుంచి 35 శాతం మంది మధ్యస్త గృహాలు, మిగతావారు ఖరీదైన ఇళ్లను కొనడానికి ఆస్కారముంది. వేరే నగరాల్లో ఇల్లు అమ్ముకుని ఇక్కడొచ్చి ఉద్యోగంలో చేరే వారు త్వరగానే సొంతింటి గురించి నిర్ణయం తీసుకుంటారు. ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నవారు వీలైనంత తొందరలోనే సొంతిల్లు కొనుగోలు చేయవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి విచ్చేసేవారిలో కనీసం 80 నుంచి 85 శాతం మంది నాలుగైదేళ్ల తర్వాతనైనా ఇక్కడే కొంటారు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైతే సొంతింటి ఎంపికలో త్వరగా నిర్ణయానికొస్తారు.
కొనేవారు.. కనీసం 20%
కొవిడ్ వల్ల గత ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ రియల్ రంగంలో కదలికలు తగ్గాయి. అక్టోబరు నుంచి మార్కెట్ ఉవ్వెత్తున ఎగిసింది. 2021 మార్చి వరకూ రియల్ రంగానికి మంచి ఊపు లభించింది. పలు ఐటీ కంపెనీలు కొత్త నియామకాల్ని చేపట్టాయి. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ ధోరణీ వల్ల ఐటీ కంపెనీలకు ఉత్పాదకత పెరిగింది. తెలంగాణ ఐటీ ఎగుమతులు 12 శాతం వృద్ధి చెందడం, 46 వేల మంది కొత్త ఉద్యోగులు రావడం అనేది అసాధారణమైన విషయం. ఇందులో కనీసం ఇరవై శాతం మంది నగరంలో ఇళ్లను కొంటారు. వీరితో బాటు ఫార్మా, విద్య, వైద్యం, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందినవారూ రియల్ రంగంలో పెట్టుబడి పెడుతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థతో పాటు నిర్మాణ రంగమూ వృద్ధి చెందుతుంది.
దశాబ్దం వరకూ ఢోకా ఉండదు
వచ్చే ఐదు నుంచి పదేళ్ల వరకూ హైదరాబాద్ ఐటీ రంగానికి గణనీయంగా వృద్ధి చెందుతుంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికొస్తాయి. ఈ రంగం అప్రతిహతంగా దూసుకెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు.. మన భౌగోళిక స్వరూపం, ఫ్రెండ్లీ పోలిసింగ్, సానుకూల వాతావరణం, నగరానికి గల విశిష్ఠమైన లక్షణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక అంశాల వల్ల మన రియల్ రంగం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇతర నగరాలకు చెందిన ఐటీ ఉద్యోగుల్లో దాదాపు యాభై శాతం మంది ఇక్కడే ఇళ్లను కొంటున్నారు. వీరిలో 26-35 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికాకు వెళ్లినా హైదరాబాద్‌లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారి సంఖ్య ఎక్కువ.