అబుదాబీకి చెందిన లులూ గ్రూప్ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతుందా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తుంది. దాదాపు 34 దేశాల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న లులూ గ్రూప్.. నగరానికి చెందిన మంజీరా గ్రూపు మధ్య కుదిరిన ఒప్పందం ఇటీవల రిజిస్టర్ అయ్యింది. కేపీహెచ్బీ కాలనీ జేఎన్‌టీయూ దగ్గర గల నాలుగున్నర లక్షల చదరపు అడుగుల మంజీరా మాల్‌ను సుమారు ఇరవై ఐదేళ్ల పాటు నిర్వహించడానికి లులూ మాల్‌తో మంజీరా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో సింహభాగం వాటా లులూ మాల్ నిర్వహిస్తుండగా.. మరికొన్ని అంతర్జాతీయ బ్రాండ్లు ఈ మాల్‌లో ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఇంటీరియర్స్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని సమాచారం.
ఓ అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టడం.. తమ కార్యకలాపాల్ని నిర్వహించడానికి కేపీహెచ్‌బీ కాలనీలోని మంజీరా మాల్‌ను ఎంచుకోవడం స్వాగతించాల్సిన విషయమని నిర్మాణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విదేశీ సంస్థలు నగరంలోకి అడుగుపెట్టడానికి ఆస్కారం ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా, ఇదే సంస్థ మంజీరా గ్రూప్ రాజమండ్రిలో తలపెట్టిన షాపింగ్ మాల్‌లోనూ ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలిసింది. మొత్తానికి, ఏప్రిల్ మొదటి వారంలో లులూ మాల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నదని సమాచారం.