దేశంలో పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అవి కొత్త నగరాల అభివృద్ధి చేయడం, పాత పట్టణ వ్యవస్థలను ఆధునీకరించడం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేవలం కొన్ని మాత్రమే ప్రణాళికాబద్ధమైన నగరాలు నిర్మించారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి గత 75 ఏళ్లలో 75 కొత్త, ప్రధానమైన ప్రణాళికాబద్ధమైన నగరాలు నిర్మించి ఉంటే.. ఈరోజు భారతదేశ ముఖచిత్రం పూర్తి విభిన్నంగా ఉండేది’ అని వ్యాఖ్యానించారు.
అర్బన్ ప్లానింగ్ డెవలప్ మెంట్, శానిటేషన్ పై బడ్జెట్ అనంతరం జరిగిన వెబినార్ లో ఆయన మాట్లాడారు. 21వ శతాబ్దంలో భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తుకు అనేక కొత్త నగరాలు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇందుకోసం ఈ ఏడాది రూ.15 వేల కోట్లు కేటాయించామని.. దేశంలో ప్రణాళికమైన, క్రమబద్దమైన పట్టణీకరణకు ఇదో నూతన అధ్యాయమని, ఇది మరింత ఊపందుకోనుందని వ్యాఖ్యానించారు. ‘నగరాల పేలవమైన ప్రణాళిక లేదా ప్రణాళిక తర్వాత సరైన అమలు లేకపోవడం వల్ల అభివృద్ధిలో పెను సవాళ్లు సృష్టిస్తాయి. రవాణా ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక, నీటి నిర్వహణ వంటి అంశాల్లో చాలా ఏకాగ్రతతో పనిచేయడం చాలా అవసరం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు ఎల్లప్పుడూ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రణాళికాబద్ధమైన పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసినప్పుడే వారు దేశాభివృద్ధికి తోడ్పడగలుగరు’ అని మోదీ పేర్కొన్నారు. జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లానింగ్, వివిధ రకాల ప్రణాళికా సాధనాల అభివృద్ధి, సమర్థవంతమైన మానవ వనరులు లేదా సామర్థ్య నిర్మాణం వంటి మరిన్ని వినూత్న ఆలోచనల గురించి ఆలోచించాలని పట్టణ ప్రణాళికాకర్తలను కోరారు. భారతదేశం నిర్మించే కొత్త నగరాలు చెత్తరహితంగా, నీటి వనరులు, వాతావరణాన్ని తట్టుకోగలిగినవిగా ఉండాలని.. ఇందుకోసం పట్టణ మౌలిక సదుపాయాలు, టైర్-2, టైర్-3 నగరాల్లో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.