-
-
పార్కింగ్ లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేయాలి
-
ఎం. ప్రేమ్ కుమార్, అధ్యక్షుడు,
నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్
-
కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒకవైపు భారీ స్థాయిలో హరితహారం చేపడుతోంది.. మరోవైపు అధిక సంఖ్యలో కార్లను రోడ్ల మీదికి అనుమతిస్తుంది. ఇలా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్లను తగ్గించేందుకు సరికొత్త రీతిలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకులు రుణాలిస్తున్నాయి కదా అని.. అనేక మంది కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. వీరికి కార్ పార్కింగ్ సదుపాయం లేకపోయినప్పటికీ.. కార్లు మాత్రం కొనేస్తున్నారు. ఈ సంఖ్యను నియంత్రించడానికి ఏం చేయాలంటే..
హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో.. వంద, రెండు వంద గజాల స్థలంలో.. కొందరు అనుమతి లేకుండా నాలుగైదు అంతస్తుల్ని కట్టేస్తున్నారు. ఒక్కసారి యూసుఫ్ గూడాలోని శ్రీ కృష్ణానగర్ వంటి కాలనీలను గమనిస్తే.. గత పదేళ్లలో అనేక మంది రెండు వందల గజాల్లో నాలుగైదు అంతస్తుల్ని కట్టేసిన విషయాన్ని కళ్లారా చూడొచ్చు. ఇక అందులో నివసించేవారంతా తమ వాహనాల్ని ఇంటి బయటే పార్కింగ్ చేస్తున్నారు.
అసలే 20 నుంచి 30 అడుగులుండే రోడ్డుకి అటూఇటూ వాహనాల్ని పెట్టడం వల్ల.. అర్థరాత్రివేళలో అత్యవసరాల్లో ఆంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి ఎదురవుతోంది. ఫలితంగా, సకాలంలో వైద్యం అందక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా, ఇలాంటి అక్రమ నిర్మాణాల సంఖ్య హైదరాబాద్లోని అనేక కాలనీల్లో నిత్యకృత్యంగా మారింది. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులను ఏదోరకంగా మేనేజ్ చేసి.. ప్రజలు అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరుపుతున్నారు.
ఈ అంశాన్ని క్షుణ్నంగా గమనించిన ప్రభుత్వం.. కార్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే కారు పార్కింగ్ చూపెట్టాలనే నిబంధనను తెచ్చేందుకు ప్రణాళికల్ని రచిస్తుందని సమాచారం. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. అక్రమ నిర్మాణాలు తగ్గుతాయని.. కేవలం పార్కింగ్ సౌకర్యం ఉన్నవారే వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆయా ప్రాంతంలోని మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుంది.