- పెరిగిన ఫ్లాట్ల అమ్మకాలు
- లగ్జరీ గృహాల సేల్స్ టాప్
తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది. ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా.. లేక కొత్త ఇల్లు కొనాలన్నా ఉగాది పండుగను చూసుకోవడం మన తెలుగువారికి ఓ ఆచారం. మరి ఉగాదికి రియల్ అమ్మకాలు ఊపందుకున్నాయా?
పెరుగుతున్న వడ్డీ రేట్లు, రోజురోజుకు ఎక్కవవుతున్న ప్రాపర్టీ ధరల ప్రభావం ఉగాది అమ్మకాలపై పడుతుందా అనే సందేహాలు అంతటా అలుముకున్నాయి. కరోనా తర్వాత రియల్ రంగం గాడిన పడినప్పటికీ, ప్రాపర్టీ అమ్మకాల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అందుబాటు ధరల గృహాలు, సాధారణ అపార్టుమెంట్ల అమ్మకాలు ఆశించిన రీతితో సాగడం లేదు. అదే సమయంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా ఆకాశహర్మ్యాల్లో కొనేవారి సంఖ్య పెరగడం గమనార్హం. నమ్మకమైన డెవలపర్ల వద్ద విశాలమైన ఫ్లాట్లను కొనేవారు అధికమయ్యారు.
మనకు ఉగాదిలాగే మహారాష్ట్ర వాసులకు గుడిపడ్వా అత్యంత శుభప్రదమైన పండుగ. మహారాష్ట్ర కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఆ రోజునే ఇల్లు కొనడానికి లేదా బుకింగ్ చేసుకోవడానికి మంచి సమయంగా భావిస్తారు. ఇదే సమయంలో అక్కడి డెవలపర్లు సైతం ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించారు. ముఖ్యంగా బిల్డర్లు తరుచుగా చౌక లేదా స్టాంపు డ్యూటీ లేని ప్రత్యేక డీల్స్ ప్రకటిస్తుంటారు. అలాగే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా దీనినే అనువైన సమయంగా ఎంచుకుంటారు. మరోవైపు ఈఎంఐ ఆఫర్లు ఎలాగూ ఉంటాయి. ఓ ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకున్నవారికి ఏడాది పాటు ఈఎంఐలు కట్టనవసరం లేకుండా చూసుకుంటారు. ఆ మొత్తాన్ని బిల్డర్లే భరిస్తారు. అంతేకాకుండా చదరపు అడుగు ధరను కొంచెం తగ్గించి కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. మరికొందరు బిల్డర్లు ఫ్లాట్ బుక్ చేసుకున్నవారికి ఫర్నిషింగ్ ఉచితంగా చేయించి ఇస్తారు. దీంతో చాలామంది ఇళ్ల కొనుగోలుదారులు గుడిపడ్వా రోజున కొత్త ఇల్లు కొనుగోలుకు క్యూ కడుతుంటారు.